వన్డే వరల్డ్ కప్ సందడి షురూ అయింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఒక్కో దేశం భారత్‌కు చేరుకుంటోంది. ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ఇండియాకు వచ్చాయి. ఈ రెండు టీమ్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం వామప్ మ్యాచ్ కూడా జరిగింది. పాక్, కివీస్ తర్వాత ఇంగ్లండ్ భారత్‌కు చేరుకుంది. శనివారం టీమిండియాతో వామప్ మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లీష్ టీమ్ గువాహతిలో ల్యాండ్ అయింది. అయితే ఆ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌కు వచ్చిన తమకు సరైన సౌకర్యాలు కల్పించలేదని ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో సీరియస్ అయ్యాడు.
ఇదే ఆతిథ్యం అంటూ బీసీసీఐపై బెయిర్‌స్టో ఫైర్ అయ్యాడు. ఇంగ్లండ్ నుంచి గువాహతి వరకు ఎకానమీ క్లాసులోనే ప్రయాణించడం మీద అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు 38 గంటల పాటు తాము ఎకానమీ క్లాసులోనే ప్రయాణించామని సోషల్ మీడియా పోస్టు ద్వారా బెయిర్‌స్టో తెలిపాడు. ఇది తమను తీవ్ర అయోమయానికి గురిచేసిందన్న ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్.. ఇతర ప్యాసింజర్లతో కలసి ఒకే ఫ్లైట్‌లో భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించాడు. అంతా గందరగోళంగా మారిందని.. విమానంలోకి వచ్చిన తర్వాత దాదాపు 38 గంటల పాటు ప్రయాణం సాగిందని బెయిర్‌స్టో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
విమానంలో ప్రయాణం చేస్తున్న ఒక ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో బెయిర్‌స్టో షేర్ చేశాడు. ఇందులో అతడితో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, క్రిస్ వోక్స్ కూడా ఉన్నారు. అలాగే మిగిలిన ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే ఇంగ్లీష్ ప్లేయర్ల కోసం ఎకానమీ క్లాస్ టికెట్స్ బుక్ చేసింది ఎవరు? అనేదాని మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మామూలుగా టీమ్‌లోని ప్రధాన ఆటగాళ్లకు బిజినెస్ క్లాస్ టికెట్స్ బుక్ చేస్తారు. మిగతా ప్లేయర్లకు మాత్రం ఎకానమీ క్లాస్ టికెట్స్ కేటాయిస్తారు. కీలక ఆటగాళ్లకు రెస్ట్ కావాల్సినప్పుడు మెయిన్ ప్లేయర్స్ తమ బిజినెస్ క్లాస్ టికెట్స్‌ను వారికి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్ల విషయంలోనూ ఇదే జరిగినట్లుగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి టీమిండియా స్టార్ క్రికెటర్.. ఎవరంటే?