iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి

  • Published May 08, 2024 | 8:29 AMUpdated May 08, 2024 | 8:29 AM

Hyderabad Rain: మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు మృతి చెందారు. ఆ వివరాలు..

Hyderabad Rain: మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు మృతి చెందారు. ఆ వివరాలు..

  • Published May 08, 2024 | 8:29 AMUpdated May 08, 2024 | 8:29 AM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి

దాదాపు మార్చి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇక ఏప్రిల్‌, మే ఆరంభంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు పలువురు మృతి చెందారు. ఇక మే నెల మొత్తం ఎలా ఉండాలా అని బాధపడుతున్న జనాలకు మంగళవారం కాస్త ఊరట కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జోరు వానలో హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయ్యింది. మంగళవారం సాయంత్రం నుంచి నగరంలో గాలి, వాన బీభత్సం సృష్టించాయి. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు నగరంలో భారీ వర్షం కురిసింది. ఇన్నాళ్లు ఎండలతో అల్లాడిన జనాలు.. జోరు వాన కారణంగా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ జనజీవనం మాత్రం అస్తవ్యస్తం అయ్యింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇక హైదరాబాద్‌లో మంగళవారం కురిసిన వాన కారణంగా బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నిర్మాణం కోసం పని చేస్తున్న కార్మికులు.. తాత్కాలికంగా వేసుకున్న షెడ్‌పై నిర్మాణంలో ఉన్న గోడ కూలి పడటంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో షెడ్‌లో ఉన్న కార్మికులు ఏడుగురు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీల సాయంతో చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు.

ఇక చనిపోయిన వారినిరాజు (25), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4), ఖుషి, తిరుపతిరావు (20), శంకర్‌ (22)గా గుర్తించారు. వీరంతా ఒడిషా, ఛత్తీస్‌ఘడ్‌ రాష‍్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. రైజ్‌ డెవలపర్స్‌ నిర్మాణ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు.. ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి