iDreamPost

హైదరాబాద్‌లో మిస్సై.. వైజాగ్‌ బీచ్‌లో శవంగా.. మిస్టరీగా ఐఐటీ విద్యార్థి అదృశ్యం!

  • Published Jul 25, 2023 | 9:37 AMUpdated Jul 25, 2023 | 9:37 AM
  • Published Jul 25, 2023 | 9:37 AMUpdated Jul 25, 2023 | 9:37 AM
హైదరాబాద్‌లో మిస్సై.. వైజాగ్‌ బీచ్‌లో శవంగా.. మిస్టరీగా ఐఐటీ విద్యార్థి అదృశ్యం!

హైదరాబాద్‌లో ఐఐటీ చదువుతోన్న కార్తీక్‌ మిస్సింగ్‌ కేసు మిస్టరీగా మిగిలింది. వారం రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోయిన కార్తీక్‌.. సోమవారం వైజాగ్‌ బీచ్‌లో శవంగా తేలాడు. అయితే పోలీసులు మాత్రం కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కార్తీక్‌ సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో జూలై 17న హాస్టల్‌ నుంచి బయటకు వచ్చిన కార్తీక్‌..సోమవారం రాత్రి వైజాగ్ బీచ్‌లో శవమై తేలాడు. బీచ్‌లో కార్తీక్‌ మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

అనంతరం అది హైదరాబాద్‌లో మిస్‌ అయిన ఐఐటీ స్టూడెంట్‌ కార్తీక్ మృతదేహాంగా గుర్తించారు. దీని పోలీసులు కార్తీక్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని విశాఖలోని జీజీహెచ్‌కు తరలించారు. బాగా చదువుకుని తమకు అండగా నిలబడతాడని భావించిన కొడుకు ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలోని ట్యాంక్ తండా చెందిన కార్తీక్‌ సంగారెడ్డి కంది ఐఐటీలో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. రెండు సబ్జెక్ట్స్‌ బ్యాక్‌లాగ్‌ ఉన్నట్లు తెలిసింది. మరి కారణం తెలియదు కానీ ఈ నెల 17న కార్తీక్‌ కంది హాస్టల్‌ నుంచి బయటకు వచ్చాడు. ఎంతసేపటికి హాస్టల్‌కు తిరిగి రాలేదు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా హాస్టల్‌ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్‌ చేశారు. దానిలో అతడు ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో కాలేజీ హాస్టల్ నుండి బయటకు వచ్చినట్లు రికార్డు అయింది.

ఆ తర్వాత క్యాబ్‌ బుక్‌ చేసుకుని.. రాత్రి 9 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత లోకల్ ట్రైన్‌లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు కార్తీక్‌. అనంతరం 18వ తేదీ ఉదయం 6 గంటలకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి వైజాగ్ వెళ్లాడు. 19వ తేదీ ఉదయం నుంచి కార్తీక్‌ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు తెలిసింది. ఆ తర్వాత అతడి ఆచూకీ లభ్యం కాలేదు. వారం రోజుల తర్వాత.. సోమవారం నాడు వైజాగ్‌ బీచ్‌లో గుర్తు పట్టరాని స్థితిలో కార్తీక్‌ మృతదేహం లభ్యమయ్యింది. కార్తీక్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆరీలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో బీచ్‌లో దూకి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

కార్తీక్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బ్యాక్‌లాగ్స్‌ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక వేరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేప్టటారు. పోస్ట్‌మార్టం అనంతరం కార్తీక్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తారని వెల్లడించారు పోలీసులు. చెట్టంత ఎదిగిన కొడుకు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి