Venkateswarlu
Venkateswarlu
అత్తింటి బంధువులు అనుమానిస్తున్నారన్న బాధతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్, సరూర్‌నగర్ కృష్ణా నగర్‌కు చెందిన విష్ణువర్థన్‌రెడ్డికి.. మియాపూర్ ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళతో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. ప్రస్తుతం వీరికి 6 ఏళ్ల పాప కూడా ఉంది. పెళ్లయిన కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది.
తర్వాతినుంచి శశికళకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. అత్తింటి బంధువులు ఆమెను అనుమానిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన బాధను తల్లి గౌరీ కుమారికి చెప్పుకుని శశికళ కన్నీళ్లు పెట్టుకునేది. తల్లి ఆమెను ఓదార్చేది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం శశికళకు అత్తింటి వారినుంచి అవమానం జరిగింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. అవమానాలు భరించలేక బతకలేను అనుకుంది. గురువారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
భార్య ఎంత సేపటికి బయటకు రాకపోవటంతో విష్ణువర్థన్‌కు అనుమానం వచ్చింది. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. లోపల శశికళ మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. విషయం చెప్పకుండా అతడు ఆమె తల్లికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఆమెకు అనుమానం వచ్చింది. ఇంటి పక్కలి వాళ్లకు ఫోన్ చేయగా అసలు విషయం తెలిసింది. హుటాహుటిన బంధువులతో శశికళ అత్తింటికి వెళ్లింది. విగతజీవిగా ఉన్న కూతుర్ని చూసి విలవిల్లాడింది. అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.