iDreamPost

హుజురాబాద్‌ ఉప ఎన్నిక అంతపని చేసిందా..?

హుజురాబాద్‌ ఉప ఎన్నిక అంతపని చేసిందా..?

ప్రజాప్రతినిధి కాలం చేయడం, అనర్హతకు గురవడం, రాజీనామా చేయడం..వంటి అనేక కారణాల వల్ల ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ తరహాలోనే గత ఏడాది అక్టోబర్‌లో తెలంగాణలోని హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్‌లో పుట్టి పెరిగిన ఈటెల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఫలితంగా ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఈటెల రాజేందర్‌ పోటీచేసి గెలిచారు.

ఈ ఎన్నిక ముగిసి ఆరునెలలు కావస్తోంది. అయితే తాజాగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. అది హుజురాబాద్‌ ఉప ఎన్నికతో ముడిపడి ఉండడంతో ఈ ఎన్నిక గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సి వస్తోంది. కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కారణమని కిషన్‌ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. ఈ ఉప ఎన్నిక తర్వాతే కేంద్రం, రాష్ట్రం మధ్య వివాదం మొదలైందని ఆయన చెప్పడం విశేషం.

ఇటీవల కొంతకాలంగా తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కేంద్రంపై కాలుదువ్వుతున్నారు. వివిధ అంశాలపై ఆయన కేంద్ర సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు, పెట్రోల్, డీజిల్‌ధరల పెంపుపై నిరసనలు చేపట్టడంతోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాలు, బంద్‌లకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అంతేకాదు బీజేపీ దేశాన్ని నాశనం చేసిందని, సహజ వనరులను వినియోగించుకోలేని అసమర్థ ప్రభుత్వమంటూ పలు గణాంకాలను చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమని, దాని ఏర్పాటులో తాను కీలకంగా వ్యవహరిస్తానంటూ చెబుతున్నారు. అటు పార్లమెంట్, ఇటు రాష్ట్ర శాసనసభలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు నువ్వా నేనా అన్నట్లుగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయి.

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు తెలంగాణ చర్రితలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. తన పాత మిత్రుడుని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా దళితబంధు అనే పథకం కూడా ప్రకటించారు. హుజూరాబాద్‌ నుంచే అమలు చేశారు. ఉప ఎన్నికలకు ముందే అర్హుల ఎంపిక పూర్తయింది. ఈ పథకం పేరుతో ఆయన నియోజకవర్గంలోని ప్రజలతో మమేకం అయ్యారు. సర్పంచ్, ఎంపీటీసీలకు కూడా స్వయంగా ఫోన్‌ చేశారు. నియోజకవర్గ నేతలకు రాష్ట్రస్థాయిలో నామినేటెట్‌ పదవులు ఇచ్చారు.మంత్రులు,ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించారు. ఇంత చేసినా.. టీఆర్‌ఎస్‌కు గెలుపు దక్కలేదు. ఈటెల రాజేందర్‌ 20 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.ఈటెల స్వయంశక్తితో గెలిచినా..బీజేపీ నైతికంగా మద్ధతు ఇవ్వడంవల్లే సాధ్యమైందనే భావనలో కేసీఆర్‌ ఉన్నారు. అయితే అంతకుముందు కూడా పలు సందర్భాల్లో కేసీఆర్‌ కేంద్రంపై విమర్శలు చేశారు. అయితే హుజురాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత ఆ స్పీడును పెంచారు. తరచూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. అందుకే హుజూరాబాద్‌ ఉప ఎన్నికే వివాదానికి కారణం అయిందని కిషన్‌ రెడ్డి భావిస్తున్నట్లుగా ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి