iDreamPost

కరోనా కట్టడికి దారేది.. ఒకే రోజులో 1000 కి పైగా కేసులు..

కరోనా కట్టడికి దారేది.. ఒకే రోజులో 1000 కి పైగా కేసులు..

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న కూడా కొత్త కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ రోజు శనివారం 1035 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 7,444 చేరాయి. 24 గంటల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా మహమ్మారి ని ఎదుర్కొనేందుకు 586 ఆసుపత్రులను ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా ను నియంత్రించేందుకు భౌతిక దూరం పాటించడమే మన ముందు ఉన్న ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. దేశంలో లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో నిత్యావసరాల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1,71,718 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని లవ్ అగర్వాల్ తెలిపారు.

కాగా కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలు పై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ లాప్ మరికొన్ని రోజులు పొడిగించాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య మంత్రులతో సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ పొడిగింపు పై అధికారికంగా ప్రకటన చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి