iDreamPost

వికేంద్రీకరణకే హైపవర్‌ కమిటీ మొగ్గు

వికేంద్రీకరణకే హైపవర్‌ కమిటీ మొగ్గు

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకే అధికారులు, మంత్రులతో కూడిన హైపవర్‌ కమిటీ మొగ్గు చూపింది. జీఎన్‌రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు ఆర్థిఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన హైవపర్‌ కమిటీ ఈ మేరకు రెండు కమిటీలపై ప్రాథమికంగా చర్చించింది. రాష్ట్రంలో ప్రజలు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ పై ప్రజల్లో జరుగుతున్న చర్చపై సమావేశంలో చర్చించారు. ప్రజల మనోభావాలను గౌరవించి పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామన్నారు. రెండు నివేధికలపై మరింతగా అధ్యయనం చేయాల్సి ఉందని సమావేశం అనంతరం మంత్రి బుగ్గన వెల్లడించారు.

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రంలో ఎలా జరగాలో కమిటీ చర్చించింది. జోన్లు, సెక్టార్ల వారీగా అభివృద్ధి ఎలా జరగాలన్న అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని గణాంకాలు, వాస్తవ పరిస్థితులు, జీఎన్‌ రావు, బీసీజీ కమిటీల్లోని లెక్కలతోపాటు గతంలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలతోపాటు రాష్ట్రంలోని స్టేక్‌ హోల్డర్స్‌ అభిప్రాయాలు తీసుకుంటామని బుగ్గన తెలిపారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని, మరో సమావేశంలో కమిటీల రెండు నివేదికలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి హైపవర్‌కమిటీ తరఫున నివేదిక ఇస్తామని బుగ్గన పేర్కొన్నారు.

హైవపర్‌ కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీలో సూత్రప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. జీఎన్‌ రావు, బీసీజీతోపాటు తాజాగా హైవపర్‌ కమిటీ కూడా అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకే మొగ్గు చూపడంతో మూడు రాజధానుల ఏర్పాటు ఇక లాంఛనమే కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి