iDreamPost

వైసిపి ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసిపి ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన లాక్‌డౌన్‌ను ప్రజా ప్రతినిధులే ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి బాష్కర్‌ రెడ్డి, విడదల రజనీ, ఆర్‌కే రోజా, బియ్యపు మధుసూదన్‌ రెడ్డిలు తమ నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా వ్యాఖ్యలు చేసింది.

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై ప్రభుత్వం చర్యలు తీసుకోనప్పుడు తాము సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు సహాయం చేసేందుకు ఎమ్మెల్యేలు వెళ్లారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై పూర్తి వివరాలు అందజేయడానికి సమయం కావాలని అడ్వకేట్‌ జనరల్‌ సమయం కోరడంతో హైకోర్టు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రజలకు ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో పేదలు తమ రోజు వారీ జీవనం సాగించేందుకే త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన విధంగా పేదలను ఆదుకుంటున్నాయి. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, సానిటైజర్లు, మాస్క్‌లు, భోజనం అందిస్తూ కష్ట కాలంలో బడుగుజీవులకు అండగా ఉంటున్నారు. కష్టకాలంలో ప్రజలు సాటి వారికి సహాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పిలుపునిచ్చారు. టీవీల్లో పలు సంస్థలు దానం చేయాలంటూ సందేశాలు ఇస్తున్నాయి.

వలస కూలీలు, కార్మికులు వందల కిలోమీటర్ల దూరంలోని వారి స్వస్థలాలకు వెళుతూ మార్గమధ్యలో ప్రాణాలు విడుస్తున్నారని, వారికి భోజనం, రవాణా సదుపాయం కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇటీవల సుప్రిం చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా అందరికీ గుర్తుకు వస్తున్నాయి. కార్మికులు, కూలీలకు సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని సుప్రిం చెప్పి దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా ఏపీ హైకోర్టు పేదలకు సహాయం చేసిన ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ ఎందుకు జరపకూడదంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. అటు ప్రభుత్వాలు పేదలు, వలస కూలీలను ఆదుకోక, ఇటు ప్రజా ప్రతినిధులు సహాయం చేయకపోతే.. వారి పరిస్థితి ఏమిటి..? అన్న సృహ సామాన్యులకు కలుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి