Tirupathi Rao
Tirupathi Rao
ఇప్పటికీ ప్రధాన ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ ఏది అంటే సినిమా అనే చెప్పేస్తారు. పండగైనా, స్పెషల్ అకేషన్ అయినా పిండి వంటలు, కొత్త బట్టలు ఎలాగో.. ఇండియాలో సినిమా కూడా అలాగే. స్పెషల్ డే రోజు కచ్చితంగా సినిమాకి వెళ్లాల్సిందే. అలాంటి సినిమా ప్రేక్షకులకు ఈ సెప్టెంబర్ నెల జాతర అనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెల మొత్తం 12 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మోస్ట్ అవెయిటెడ్ ఏమున్నాయి? ఏ భాష నుంచి ఏ సినిమా రిలీజ్ కాబోతోంది? ఏ మూవీ మీద బజ్ ఎక్కువగా నడుస్తోందో చూద్దాం.
ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కూడా తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈ సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్న సినిమాల్లో కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమాల హవా కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ సినిమాలకు పోటీగా పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమాలు ఉన్నాయి కాబట్టి. ఈ సెప్టెంబర్ నెలలో కూడా టాలీవుడ్ దే పైచేయి అవుతుందనే కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆ లిస్టులో ఏమేం సినిమాలు ఉన్నాయో చూద్దాం.
సినిమా ప్రేక్షకులకు ఖుషీ సినిమాతో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. సమంత-శివ నిర్వాణ- విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లవ్ స్టోరీ సక్సెస్ తో పాన్ ఇండియా హీరో ప్రయత్నాలను మళ్లీ మొదలు పెట్టాలని రౌడీ హీరో చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంతకాలంగా హిట్ కోసం చూస్తున్న సమంత కూడా ఈ మూవీతో మళ్లీ తన మార్క్ చూపించాలని చూస్తోంది. పైగా ఈ మూవీకి ఒక వారంపాటు పాన్ ఇండియా లెవల్లో పోటీ లేదనే చెప్పాలి. సెప్టెంబర్ లో విడుదలవుతున్న మరికొన్ని చిత్రాలు: తమిళంలో యోగిబాబు ‘లక్కీ మ్యాన్’, శరత్ కుమార్ ‘పారంపొరుళ్’, హిందీలో కల్కి కొచ్చిన్ ‘గోల్డ్ ఫిష్’, కేకే మీనన్ ‘లవ్ ఆల్’, ‘మిస్టరీ ఆఫ్ టాటూ’ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
సెప్టెంబర్ 7 అనుష్క ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే బహుబలి 2 తర్వాత మళ్లీ ఇప్పుడే స్వీటీ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవీన్ పోలిశెట్టి- అనుష్క జంటగా నటించిన మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి సినిమా విడుదల కాబోతోంది. అయితే అదే రోజు షారుక్ ఖాన్- నయనతార జవాన్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. అయితే తెలుగు- హిందీలో జవాన్ సినిమాకి అనుష్క- నవీన్ పోలిశెట్టి సినిమా పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నవీన్ పొలిశెట్టి- అనుష్క ఇద్దరూ బాలీవుడ్ కు సుపరిచితమే. నవీన్ అయితే శుశాంత్ సింగ్ రాజ్ పుత్ చిచోరే సినిమాతో బాగా కనెక్ట్ అయ్యాడు. సెప్టెంబర్ 8న తమిళ్ లో హరీష్ ఉత్తమన్ నూడిల్స్, సత్యరాజ్ అంగారాగన్ చిత్రాలు విడుదల కానున్నాయి.
సెప్టెంబర్ 15న కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతోంది. ఎందుకంటే రామ్- బోయపాటి కాంబోలో రాబోతున్న స్కంద ఆరోజే విడుదల కానుంది. బోయపాటి సినిమా అంటే యాక్షన్ కు ఏమాత్రం లోటు ఉండదు. పైగా బోయపాటి సినిమాలకు హిందీలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే పాన్ ఇండియా లెవల్లో స్కంద హిట్ కొడుతుందని భావిస్తున్నారు. అయితే స్కందకు రాఘవ లారెన్స్ రూపంలో కాస్త గట్టి పోటీనే ఉండబోతోందని చెప్పాలి. లారెన్స్- కంగనా రనౌత్ కాంబోలో వస్తున్న చంద్రముఖి-2 కూడా సెప్టెంబర్ 15నే విడుదల కాబోతోంది. కంగనా రనౌత్- లారెన్స్ కు పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపే ఉంది. పైగా సినిమా చంద్రముఖి కావడంతో ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. మరోవైపు సెప్టెంబర్ 15న విశాన్ నటించిన మార్క్ ఆంటోనీ కూడా విడుదల కాబోతోంది.
సెప్టెంబర్ 28 కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్- పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్- మరోవైపు ప్రశాంత్ నీల్ కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పైగా కేజీఎఫ్ తో లింక్ ఉందని హింట్ ఇవ్వడం, ఫస్ట్ గ్లింప్స్, టీజర్, పోస్టర్స్ అన్నీ ఫ్యాన్స్ లో హైప్ అమాంతం పెంచేస్తున్నాయి. అయితే సలార్ కు ఎలాంటి పోటీ లేదు. ఇప్పటివరకు ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్ ఆశించిన ఫలితాలు అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ అంతీ సలార్ పైనే అంచనాలు అన్నీ పెట్టుకున్నారు. తప్పకుండా సలార్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.