iDreamPost

Happy Birthday Superstar Krishna : సాహసాలకు మారుపేరు – 80 వసంతాల సూపర్ స్టార్

Happy Birthday Superstar Krishna : సాహసాలకు మారుపేరు – 80 వసంతాల సూపర్ స్టార్

ఒక హీరోకు స్టార్ స్టేటస్ వచ్చాక ప్రయోగాలు చేయడం అరుదు. అందులోనూ సౌత్ లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే తెలుగు తమిళ పరిశ్రమలో మన తారలు రిస్క్ చేసేందుకు ఇష్టపడరు. బిజినెస్ బాగుందా, మార్కెట్ ఎలా అవుతోంది లాంటి లెక్కలు తప్ప ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని పట్టించుకునే వాళ్ళను వ్రేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అలాంటి వారిలో అగ్ర తాంబూలం ఇవ్వాల్సింది సూపర్ స్టార్ కృష్ణ గారికి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా పలురంగాల్లో తన ప్రతిభను చాటుకుని ఎన్టీఆర్ తర్వాతి తరంలో ఇన్నిరకాల బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకుంది ఈ ఘట్టమనేని హీరో ఒక్కరే.

1965లో ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు చిత్రంతో తెరగేంట్రం చేసిన కృష్ణ అనతి కాలంలో ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల ప్రభంజనం ఉధృతంగా సాగుతున్న జమానాలోనూ నిలదొక్కుకుని తన సత్తా చాటుకున్నారు. మూడో సినిమా గూఢచారి 116తో తెలుగులో జేమ్స్ బాండ్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది కృష్ణ గారే . ఐదో సినిమా సాక్షిలో కృష్ణ నటనకు వరించిన పురస్కారాలు ఎన్నో. అవే కళ్ళు లాంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చేసినా, ఉండమ్మా బొట్టు పెడతా లాంటి సెంటిమెంట్ మూవీలో నటించినా, మోసగాళ్ళకు మోసగాడు లాంటి కౌబాయ్ సినిమాతో చరిత్ర సృష్టించినా ఆయనకే చెల్లింది.

మహామహులు కలగన్న అల్లూరి సీతారామరాజు కథను 1974లోనే భారీ బడ్జెట్ తో సినిమా స్కోప్ లో కనివిని ఎరుగని స్థాయిలో నిర్మించడం చూసి కృష్ణ గారి పనైపోయిందని అనుకున్న వాళ్ళు ఎక్కువే. కాని వాళ్ళ నమ్మకాన్ని కూల్చేసి మన్నెం వీరుడిగా కృష్ణ పండించిన కలెక్షన్ల సునామి సువర్ణాక్షరాలతో శాశ్వతమైపోయింది. ఆ తర్వాత వరసగా 14 ఫ్లాపులు వచ్చినా తట్టుకుని నిలబడి మళ్ళీ పాడి పంటలు లాంటి విలేజ్ డ్రామాతో బ్లాక్ బస్టర్ అందుకుని ట్రాక్ లో పడ్డారు. చిరంజీవి హవా రాష్ట్రమంతా కొనసాగుతున్న టైంలో 1986లో ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే బాహుబలి స్థాయిలో మతులు పోయే బడ్జెట్ తో సింహాసనం లాంటి జానపద ఫాంటసీ చిత్రాన్ని తీసి ఔరా అనిపించారు.

ఇన్నింగ్స్ ముగుస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్న సమయంలో 1994లో నెంబర్ వన్, అమ్మదొంగా లాంటి సూపర్ హిట్స్ తో తన సత్తాకు ఎక్స్ పైరి డేట్ ఉండదని ఋజువు చేశారు కృష్ణ. ఇలా ఎన్నో ఎన్నెన్నో కృష్ణ గారి ఘనతలు గురించి చెప్పుకుంటే ఓ గ్రంథమే అవుతుంది. సంక్రాంతి హీరోగా పేరున్న కృష్ణ తన కెరీర్ లో సుమారు 30 సంక్రాంతులకు తన సినిమా వచ్చేలా చూసుకుని అందులో దాదాపు 80 శాతం హిట్లు అందుకున్నారు. 1977లో ఎన్టీఆర్ తో తలపడి దానవీరశూరకర్ణకు పోటీగా కోటి రూపాయల బడ్జెట్ తో కురుక్షేత్రం తీయడం కృష్ణ సాహసానికి నిదర్శనం. తన సినిమా ఫ్లాపైనా మొహమాటం లేకుండా ఒప్పుకునే కృష్ణ గారి గురించి ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ సూపర్ స్టార్ 80వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సంబరం అంబరాన్ని తాకుతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి