iDreamPost

ఈ యుద్ధం సరిపోతుందా..?

ఈ యుద్ధం సరిపోతుందా..?

మహమ్మారిలా విరుచుకుపడుతున్న కరోనాను నివారించేందుకు మున్ముందుగా దేశం చేపట్టిన చర్య లాక్‌డౌన్‌. ముందుగా చేసాం కాబట్టే తక్కువ కేసులు నమోదవుతున్నాయని అధికారపక్షం, ముందస్తు వ్యూహం లేకుండా చేసారని ప్రతిపక్షం చేసుకునే విమర్శలు పక్కన పెడితే, లాక్‌డౌన్‌ వ్యూహం ఇప్పటి వరకు సత్ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. అయితే మొదటి మూడువారాల్లో నమోదైన కేసులతో ఇది అంచనా వేయడం తొందరపాటవుతుందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు.

ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు చేపడుతున్న యుద్దం సరిపోతుందా? అన్న సందేహం ఇప్పుడు సర్వత్రా ఉంది. వ్యాధి వ్యాపించే తీరు, అందుబాటులో ఉన్న వనరులు, ఉభయ తెలుగురాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులను బేరీజు వేస్తే ఇప్పుడు చేపడుతున్న చర్యలే అన్నింటా సర్వోత్తమం అన్నది ప్రభుత్వ వాదన. కానీ అమలు చేసే లాక్‌డౌన్‌ను కూడా పక్కాగా అమలు చేయడంలో ప్రభుత్వంలోని అన్ని శాఖలు విఫలమవుతున్నాయన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు వెసులుబాటు కల్పించినప్పుడు భౌతిక దూరాన్ని పాటించే విధంగా ప్రజలను చైతన్య పర్చడంలో ఆయా శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయన్నదాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతన్నారు.

కన్పించని శత్రువుతో చేస్తున్న ఈ యుద్ధంలో ముందు వరుసలో వైద్య సిబ్బందిని నిలిపి ఇతర ప్రభుత్వ శాఖలు వెనకుండి చూస్తున్నాయన్న భావన ఉండడం చెప్పక తప్పనిది. ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి, దానిని అధిగమించేందుకు ప్రయత్నించి రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకుంటాయా? లేక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు అమలు చేస్తాయా అన్న చర్చకు కూడా అవకాశం ఏర్పడుతోంది. ఇప్పుడు కరోనా వైరస్, రేపు ఇంకొకటి కావొచ్చు.. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఒక వేళ దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేసే ఆర్ధిక సత్తా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎంతున్నదన్నది కూడా చర్చకువస్తోంది. దీర్ఘ కాలం మాట అటుంచితే విస్తృతంగా ప్రభావం చూపుతుందనుకుంటున్న నాల్గవ దశలోకే కరోనా అడుగుపెడితే ప్రజల ఆరోగ్యానికి భరోసానిచ్చే శక్తి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అని ప్రజలు భయంతో చూస్తున్నారు.

చురుగ్గా వ్యవహరించే సీయంలు ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో కూడా ప్రజారోగ్యంకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వ వైద్యరంగాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడితే అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఉన్న పదవీ కాలం సరిపోతుందా? లేదా వీరి కష్టాన్ని గుర్తించి ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ఇటువంటి అనేకానేక ప్రశ్నలకు కరోనా తెరలేపుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి