iDreamPost

‘జయహో వైజాగ్’ : ది బ్రేవ్ సిటీ

‘జయహో వైజాగ్’ : ది బ్రేవ్ సిటీ

ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఉన్న నగరం. సకల సదుపాయాలతో మెట్రోపాలిటన్ నగరంగా మారి, త్వరలో పాలనా రాజధానిగా కొత్త పుంతలు తొక్కేందుకు సన్నద్ధమవుతున్న వేళ ఎదురయిన ప్రమాదం అందరినీ కలచివేసింది. దేశవ్యాప్తంగానే ఉలిక్కిపడేలా చేసింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జరిగిన ప్రమాదం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కదిలించింది. ప్రమాదం సందర్భంగా కనిపించిన దృశ్యాలు చాలామందిని వెంటాడేలా చేసింది. స్థానికులను అప్రమత్తం చేయాల్సిన సైరన్ ఎందుకు మోగలేదు..లేదా మోగించలేదు అన్నది ఐదుగురు ఉన్నత స్థాయి అధికారుల నేతృత్వంలో వేసిన కమిటీ తేల్చబోతోంది. ఈలోగా ఇప్పటికే కంపెనీపై గోపాలుపురం పీఎస్ లో క్రిమినల్ కేసు కూడా నమోదయ్యింది. అదే క్రమంలో బాధితులకు భరోసా కల్పించే యత్నంలో ముఖ్యమంత్రి ఓ అడుగు ముందుకేసి తీసుకున్న నిర్ణయం ప్రజల అభినందనలు పొందింది.

విశాఖ వాసుల గొప్పతనం అదే..

విశాఖ మహానగరంగా రూపొందే క్రమంలో అనేక ఉపద్రవాలు ఎదర్కొంది. చిన్న, పెద్దా ప్రమాదాలను చవిచూసింది. అన్నింటినీ అధిగమించి అడుగులు వేసింది. వేస్తోంది..వేయబోతోంది కూడా. చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో 1997లోనే హెచ్పీసీఎల్ ప్రమాదం , ఆ తర్వాత 2013లో మరో ప్రమాదం జరిగాయి. ఇక స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు అనేకం చవి చూశారు. అన్నింటికీ మించి ప్రకృతి ప్రకోపం కారణంగా 2014లో ఎదుర్కొన్న హుద్ హుద్ వంటి పెను ముప్పు నుంచి బయటపడిన విశాఖ వాసుల చరిత్ర మరువలేనిది.

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి పూర్తి కారణాలు వెలుగులోకి రావడానికి సమయం పడుతుంది. శీతలీకరణ ప్రక్రియలో ఏర్పడిన సమల్యేనని ప్రాధమిక నిర్ధారణ. కారణం ఏమయినా అర్థరాత్రి పూట, అది కూడా కరోనా వేళ ఇంతటి ప్రమాదం ముంచుకొచ్చిన సమయంలో విశాఖ వాసుల వ్యవహారశైలి అబినందించక తప్పదు. స్థానిక యువత చొరవ ఎన్నో ప్రాణాలను కాపాడిందనే చెప్పవచ్చు. తొలుత గోపాలపట్నం పోలీసులు, ఆ తర్వాత విశాఖ సిటీ పోలీసులు రంగంలో దిగారు. వారికితోడుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తరలివచ్చాయి. నేవీ సహా అనేక అత్యున్నత ప్రమాణాలు కలిగిన సహాయక బృందాలు చేరాయి. అయినా ప్రారంభంలో ప్రతిస్పందించిన స్థానికుల చొరవ అసామాన్యం.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో యువత చైతన్యయుతంగా వ్యవహరించి అనేక మందిని సంరక్షించిన కారణంగానే ప్రాణనష్టం నియంత్రించగలిగారు. ప్రజలు కూడా పెను ముప్పు పొంచి ఉందని తెలిసినా సాటి వారికి తోడ్పడేందుకు సిద్ధపడిన తీరు ఆశ్చర్యం వేస్తుంది. తమకు ముప్పు ఉందని తెలిసినా, తమ తోటివారిని కూడా కాపాడేందుకు చేతులు కలిపారు. ఆ క్రమంలోనే యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించారు. ఉద్వేగానికి గురికాకుండా వీలయినంత మేరకు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగడం విశాఖ ప్రజల తీరుని విస్పష్టంగా చాటుతోంది.

Also Read:ఒకే రోజు మూడు లీకేజి ప్రమాదాలు…

అధికార యంత్రాంగం కదిలిన తీరు ఆదర్శనీయం

తెల్లవారి 3.25కి కంట్రోల్ రూమ్ కి వచ్చిన తొలి ఫోన్ కాల్ నుంచి అడుగడుగునా స్పందించిన అధికార యంత్రాంగం తీరు అభినందించాల్సిందే. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న అన్ని చోట్లా చిన్నా, పెద్దా ప్రమాదాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఆ కోవలోనే ఈ ఫోన్ కాల్ ని ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేసినా ముప్పు మరింతగా ఉండేదనడంలో సందేహం లేదు. దానికి భిన్నంగా ఫోన్ కాల్ రావడంతోనే అప్రమత్తమయ్యి , 10 నిమిషాల వ్యవధిలో తొలుత పోలీస్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు చేరుకోగా, ఆ తర్వాత 2 గంటల వ్యవధిలోనే మొత్తం సీపీ, కలెక్టర్, మంత్రి సహా యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి చేరుకున్న తీరు గమనార్హం. దాంతో అనుకున్నట్టుగా ప్రమాద సమాచారం తెలిసిన ఆరు గంటల్లోనే ఉదయం 9గం.ల లోపు గ్యాస్ లీక్ ని నియంత్రించగలిగారు. లేదంటే అలసత్వం ఎక్కడ జరిగినా పరిహారం అందరూ చెల్లించే పరిస్థితి వచ్చేది.

పారిశ్రామిక నగరంగా దినదినాభివృద్ధి జరిగి ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖలో అధికార యంత్రంగా స్పందనను జాతీయ స్థాయిలో కూడా అందరూ అభినందిస్తున్నారు. చివరకు తమిళనాడుకి చెందిన డీఎంకే అధినేత స్టాలిన్ వంటి వారయితే విశాఖ ప్రమాదాన్ని నియంత్రించిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీరోధాత్తంగా వ్యవహరించిన ప్రభుత్వ సిబ్బంది కృషిని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. తొలుత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది కొందరు అస్వస్థతకు గురయ్యారు. అయినా వెనుకంజ వేయకుండా బాధితులను చేతులపై మోసుకుని ఆసుపత్రికి తరలించిన తీరు వారి కృషిని ప్రస్ఫుటంగా చాటుతోంది.

పూణే నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గుజరాత్ నుంచి రసాయనాలు యుద్ధప్రాతిపదికన తరలించడం ద్వారా కూడా ప్రమాదాన్ని పరిమితం చేయగలిగినట్టు కనిపిస్తోంది. కేంద్రం పెద్దల నుంచి రాష్ట్రస్థాయి అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో పర్యవేక్షించిన తీరు ఇలాంటి విపత్తు వేళ ఫలితాన్నిస్తుందని మరో చాటిచెప్పింది.

Also Read:ప్రజా సేవకుడి మానవత్వానికి మచ్చుతునక

ముఖ్యమంత్రి మార్క్ చూపించారు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన మార్క్ చూపించి, బాధితులు సహా అందరి అభినందనలు దక్కించుకున్నారు. రాజకీయాలకు అవకాశం లేకుండా చేసిన ఆయన తీరు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తెల్లవారి ప్రమాదం సమాచారం అందగానే సీఎం అప్రమత్తమయ్యారు. తొలుత విశాఖ కలెక్టర్ సహా అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ఆరోగ్య అవసరాల కోసం వెనుకంజ వేయవద్దని ఆదేశించారు. ఆ తర్వాత స్వయంగా సమీక్ష నిర్వహించి డీజీపీ, సీఎస్ తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు పూనుకున్నారు. ప్రధానితో కూడా నేరుగా మాట్లాడి ప్రమాద నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

స్వయంగా తాను రంగంలో దిగి కేజీహెచ్ లో వైద్య సదుపాయాల గురించి బాధితులతో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వాస్తవానికి కరోనా కారణంగా ముఖ్యమంత్రి పూర్తిగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ ప్రమాద వార్త తెలియగానే కదిలిని తీరు, అందరినీ అప్రమత్తం చేసిన తీరు సీఎంగా జగన్ కృషిని విమర్శకులు సైతం అభినందించాల్సి వచ్చింది. అదే సమయంలో విశాఖలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విపక్ష టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునేందుకు చూపించిన చొరవ జగన్ రాజకీయ పరిణతిని చాటుతోంది. గతంలో ఉన్న విధానాలకు భిన్నంగా అందరినీ కలుపుకుపోయే రీతిలో జగన్ వ్యవహార శైలి ఉంటుందని చాటుకున్నారు.

పరిహారం విషయంలో జగన్ ప్రకటన బాధిత కుటుంబాలకు కొండంత ఉపశమనం కలిగించింది. అదే సమయంలో ఇతర రాజకీయ విమర్శలకు ఆస్కారం లేకుండా చేసింది. కంపెనీ విషయంలో కూడా తగిన నిర్ణయాలు ఉంటాయని విస్పష్టంగా చెప్పడం విశేషంగా మారింది. మొత్తంగా సీఎం జగన్ తన మార్క్ పాలనా పద్ధతులను ప్రస్పుటంగా ప్రదర్శించి ఓ మెట్టు ఎక్కారనే అభిప్రాయం కలిగించారు. మొత్తంగా సమన్వయంగా సాగిన పాలన కారణంగా పెద్ద సమస్యను కొద్దిపాటి నష్టంతో గట్టెక్కే పరిస్థితి తీసుకురావడంలో ప్రజలు, అధికారులు, ముఖ్యమంత్రి చొరవ ఉపయోగపడింది. 

Also Read:“స్టైరిన్”గ్యాస్ అంటే ఏమిటి? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

విపత్తును ఎదుర్కోవడంలో వైజాగ్ ప్రజలు,అధికారులు చూపిన తెగువను సుదీర్ఘకాలం దేశం గుర్తు పెట్టుకుంటుంది.. జయహో వైజాగ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి