iDreamPost
iDreamPost
ఒక భాషలో హిట్ అయిన సినిమాలు ఇంకో లాంగ్వేజ్ లో రీమేక్ కావడం చాలా సహజం. కానీ వీటికి సంబంధించిన కొన్ని సంగతులు ఆసక్తికరంగా ఉంటాయి. 1967లో తమిళంలో బాలచందర్ గారు ‘అనుబవి రాజా అనుబవి’ అనే మూవీ తీశారు. మంచి విజయం అందుకుంది. 1973లో కొద్దిపాటి మార్పులతో దీన్నే హిందీలో ‘ధో ఫూల్’ గా రీమేక్ చేస్తే అక్కడా హిట్టు కొట్టింది. 1977లో మలయాళంలో ‘ఆనందం పరమానందం’గా అదే సంవత్సరం కన్నడలో ‘కిట్టు పుట్ట’గా పునఃనిర్మాణం చేసుకుని సక్సెస్ అయ్యింది. ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ తో మెయిన్ స్టోరీని ఫాలో అయినవే. వీటిలో కామెడీ ప్రధాన అంశంగా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి.
1993లో బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ ని దీన్ని ఇంకోలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అనీజ్ బాజ్మీ ఇచ్చిన కథను ‘ఆంఖే’ పేరుతో రూపొందించారు. గోవిందా, చుంకీ పాండే ప్రధాన పాత్రల్లో తీసిన ఈ చిత్రం ఆ ఏడాది టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత 1995లో వెంకటేష్ హీరోగా ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఆంఖే రీమేక్ గా రూపొందిన సినిమానే పోకిరి రాజా. ఎల్విఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటరామిరెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా తీయడం అప్పట్లో ఓ పెద్ద టాక్. రోజా, ప్రతిభ సిన్హా హీరోయిన్లుగా రాజ్ కోటి స్వరకల్పనలో పాటలు సిద్ధం చేయించి 1994లో షూటింగ్ చేశారు.
పోకిరి రాజా విశేషం ఏంటంటే ఇందులో మూడు పాత్రలు డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తాయి. వెంకటేష్, శరత్ బాబు, సత్యనారాయణ ముగ్గురూ ద్విపాత్రల్లో నటించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సిటీ బ్యాక్ డ్రాప్ లో సరదాగా సాగి ఇంటర్వెల్ లో సీరియస్ టర్న్ తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగి మళ్ళీ నగరానికి చేరుకుంటుంది. రెండు వైవిధ్యమైన పాత్రల్లో వెంకీ నటన అభిమానులను బాగా నచ్చేసింది. కానీ తెలుగులో పోకిరి రాజా అంచనాలను పెద్దగా అందుకోలేదు. 1995 జనవరి 12న రిలీజైన ఈ సినిమా యావరేజ్ గానే నిలిచింది. మ్యూజికల్ గా మాత్రం పాటలు బాగా రీచ్ అయ్యాయి. అప్పుడేమో కానీ ఇప్పుడు చూస్తే డీసెంట్ ఎంటర్ టైనర్ అనిపించడమే దీని ప్రత్యేకత