iDreamPost

రాజ్యసభ చరిత్రలో తొలి సారి ఉనికిని కోల్పోయిన ఆంద్రప్రదేశ్ భారత జాతీయ కాంగ్రెస్

రాజ్యసభ చరిత్రలో తొలి సారి ఉనికిని కోల్పోయిన ఆంద్రప్రదేశ్ భారత జాతీయ కాంగ్రెస్

రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు తప్ప’ అనే మాట సరిగ్గా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది. తెలుగు నేలపై స్వాతంత్రం ముందు నుంచి ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకానొక దశలో ప్రాంతీయ పార్టీల పుట్టుకతో ఒడిదుడుకులు ఎదుర్కున్నా వై.యస్ రాజశేఖర రెడ్డి లాంటి మాస్ లీడర్ల అకుంటిత దీక్షతో తిరిగి రాష్ట్రంలో పుంజుకుంది. 1953లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఏర్పాటు అయిన దగ్గర నుండి సుమారు ఉమ్మడి రాష్ట్రాన్ని 45 ఏళ్ళ పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ తాను చేసిన అనేక స్వయంకృతాపరాధాల వలన రాష్ట్రలో ఉనికినే కోల్పోయింది.

ఇందిరా గాంధిని పార్టీ నుండి బహిష్కరించిన కాసు బ్రమ్మానందరెడ్డి, దేశానికి ప్రధానిగా చేసిన పి.వి నర్సింహారావు, రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తన భజస్కందాల పై వేసుకుని గెలిపించిన వై.యస్ రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకుల చరిత్ర ఉన్నా, అంతర్గత కుమ్ములాటలు , పదవీ కాంక్షలతోనే రాష్ట్ర కాంగ్రెస్ బ్రష్టుపట్టిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలతో దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ తనకి రాష్ట్రం తరుపున ఉన్న చివరి హోదాని కూడా పూర్తిగా కోల్పోయి ఉనికిలో లేకుండా పోయింది. రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒక్క శాసన సభ స్థానం కూడ గెలుచుకోలేని కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖాళీ అవ్వడంతో రాజ్యసభ చరిత్రలో మొదటిసారి రాష్ట్రం నుండి కాంగ్రెస్ తరుపున ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

1952 మే 13న పార్లమెంట్‌లోని ఎగువ సభ అయిన రాజ్యసభలో కార్యకలాపాలు ప్రారంభించిన రోజు నుంచి రాష్ట్రం తరుపున గలీబ్ షేక్ , మలికార్జునుడూ, కాసు వెంగల్ రెడ్డి , రహంతుల్లా లాంటి ఉద్దండులతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రాజ్యసభలో తన బలం నిరూపించుకుంటూ వచ్చింది. అయితే 68 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరువాత మొట్టమొదటి సారిగా రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్య సభలో తమ వాణిని వినిపిoచే వారు లేకుండా పోయారు. అలాగే తెలంగాణ నుండి కే.వి.పి రామచంద్రరావుల రాజ్యసభ కాలం కూడా ముగియడంతో తెలంగాణలో కూడా రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లేకుండా పోయారు.

ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో 11 రాజ్య సభ స్థానాలు ఉండగా, తెలుగుదేశం నుండి ఫిరాయిచిన నలుగురు భారతీయ జనతా పార్టీ సభ్యులు , ఆరుగురు వై.యస్.ఆర్ కాంగ్రెస్ సభ్యులు , ఒకరు తెలుగుదేశం సభ్యులు ఉన్నారు . అలాగే తెలంగాణ రాష్ట్రంలో 7 రాజ్యసభ స్థానాల్లోను తెరాసా పాగా వెయ్యడంతో ఇటు ఆంద్ర , అటు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో 68ఏళ్ళ రాజ్యసభ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పొవడం ఇదే మొదటి సారి.

రాజ్యసభకు సభాపతి (చైర్మను) గా తెలుగువాడైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉన్న సమయంలోనే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడటం. 1953 రాజ్యసభలో పెట్టిన తొలి బిల్లు ఆంధ్రరాష్ట్రానిదే అవ్వడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుండి కనుమరుగవ్వడం లాంటి అనేక సంచలనాలకు నిలవైన రాజ్యసభలో వర్తమాన కాలంలో రాష్ట్రం తరుపునుండి ఇంకా ఎన్ని మైలు రాళ్లు నమోదు అవుతాయో కాలమే నిర్ణయిస్తుంది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి