iDreamPost

సీమ ఫ్యాక్షన్ కు పునాది వేసిన సినిమా – Nostalgia

సీమ ఫ్యాక్షన్ కు పునాది వేసిన సినిమా – Nostalgia

తెలుగు వెండితెర మీద తొలిసారి రాయలసీమ ఫ్యాక్షన్ రక్కసిని కమర్షియల్ గా చూపించి కాసులు చేసుకున్న సినిమాలుగా మనకు వెంటనే గుర్తొచ్చేవి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఆది, ఇంద్ర తదితర చిత్రాలు. కాని నిజానికి అంతకు పదేళ్ళ క్రితమే దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ ఈ పగల సంస్కృతిని తెరపై ఆవిష్కరించారు. అదే కడప రెడ్డెమ్మ. శారద టైటిల్ పాత్రలో నటుడు చలపతి రావుతో కలిసి ఆవిడే దీన్ని నిర్మించారు. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆనంద్, నిత్యానంద వివాదంలో హై లైట్ అయిన మాజీ హీరొయిన్ రంజిత దీంతోనే టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

కథ విషయానికి వస్తే రెడ్డి, చౌదరి అనే రెండు వర్గాల మధ్యలో కడప జిల్లా పులిచింతల అనే గ్రామంలో కక్షలు రాజ్యమేలుతూ ఉంటాయి. ఇద్దరి కుటుంబాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని పెద్దలు కాదంటారని అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఓ బిడ్డ కూడా కలుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో చాలా ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చిన ఈ ప్రేమ జంటను అవే కక్షలు బలి తీసుకోవడంతో కత్తి పట్టిన రెడ్డెమ్మ దానికి కారణమైన వాళ్ళను తెగనరికి బిడ్డతో సహా జైలుకు వెళ్తుంది. స్థూలంగా ఇదీ కథ.

కమర్షియల్ గా కడప రెడ్డెమ్మ బాగానే పే చేసింది. బి గోపాల్ లాంటి దర్శకులకు సీమ కక్షల కథల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ కొట్టించిన పరుచూరి బ్రదర్సే దీనికీ కథా మాటలు అందించారు. విద్యాసాగర్ సంగీతం ఉపయోగపడింది. అప్పటికే హీరోగా హిట్స్ అందుకుని ఫాం లో ఉన్న మోహన్ బాబు పాత్ర నచ్చి ఇందులో విలన్ గా నటించారు. గిరిబాబు, నూతన్ ప్రసాద్ లాంటి వాళ్ళు గెస్ట్ రోల్స్ చేశారు. భారీ తారాగణాన్ని తీసుకోవడంతో కథ గ్రామంలోనే సాగినా రిచ్ మేకింగ్ కనిపిస్తుంది. కాకపోతే రక్తపాతం తీవ్రంగా ఉంటుంది.

ప్రధాన పాత్రల్లో శారద, మోహన్ బాబు చెలరేగిపోయారు. సీరియస్ గా సాగే కథలో కుర్ర జంట మద్య నాలుగు డ్యూయెట్లు పెట్టడం చికాకు పుట్టిస్తుంది. హోటల్ నడుపుతూ ప్రేమజంటకు ఆశ్రయమిచ్చి ప్రాణాలు కొల్పొయే పాత్రలో అన్నపూర్ణ చక్కని నటన ప్రదర్శించారు. స్టార్ హీరోలు లేరు కాబట్టి ఇది భారీ రేంజ్ ను అందుకోలేదు కాని బి గోపాల్ కన్నా ముందే సీమ రక్తపాతాన్ని తెరకు పరిచయం చేసిన ఘనత మాత్రం కడప రెడ్డెమ్మకే దక్కుతుంది. అప్పటి నుంచి మొన్నటి అరవింద సమేత వీర రాఘవ దాకా ఈ పరంపరను ఎవరో ఒకరు కొనసాగిస్తూనే ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి