iDreamPost

కోవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న పరికరాలపై జీఎస్‌టీ వొద్దు

కోవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న పరికరాలపై జీఎస్‌టీ వొద్దు

ప్రాణాంతక కోవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న పరికరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూలు నిలిపివేయాలని కేంద్రానికి సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.క‌రోనా మహమ్మారి నుండి ర‌క్ష‌ణ పొందటానికి వాడే శానిటైజ‌ర్‌లు,మాస్క్‌లు వంటి పరికరాలపై జీఎస్‌టీ వసూలు చేయడం తప్పని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాధితో, పేదరికంతో బాధపడుతున్న ప్రజల నుంచి శానిటైజ‌ర్‌లు, సబ్బులు,మాస్క్‌లు, గ్లౌజులు వంటి పరికరాలపై జీఎస్‌టీ వసూలు చేయడం మంచిది కాదన్నారు. జీఎస్‌టీ లేని కరోనా రక్షిత వస్తువుల కోసం డిమాండ్ చేస్తున్నట్లు ట్వీట్‌లో ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం టెస్టు కిట్స్‌, వెంటిలెట‌ర్‌లపై 12 శాతం, పీపీఈలు,మాస్క్‌ల‌పై 5 శాతం,శానిటైజ‌ర్ల‌పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.క‌రోనా రక్కసి బారి నుండి ర‌క్ష‌ణ పొందటానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు, శానిటైజ‌ర్‌లు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అలాగే క‌రోనా బాధితుడి అత్యవసర చికిత్సలో వెంటిలెట‌ర్లు ఉప‌యోగిస్తుండ‌గా వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను వాడుతున్నారు.క‌రోనా నేపథ్యంలో ఈ వస్తువులపై జీఎస్టీని రద్దు చేయాలని కేంద్రాన్ని పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

మాస్క్‌లు,శానిటైజ‌ర్‌లపై జీఎస్టీ ఎత్తివేస్తే అనేక విప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.ముఖ్యంగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌లో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకునే ప్రమాదం ఉందని తెలుపుతున్నాయి.దీనితో పాటు ఈ పరికరాల ధ‌ర మరింత పెరిగి చివరకు వినియోగదారులపై భారం పడుతుందని కేంద్రం వాదిస్తుంది.కానీ ఇటీవ‌లే రక్షిత వైద్య పరికరాలపై బేసిక్ క‌స్ట‌మ్స్ డ్యూటీ,హెల్త్ సెస్‌ల‌ను వ‌చ్చే సెప్టెంబ‌ర్ వ‌ర‌కు మినహాయించింది. అయితే ఈ చర్య వల్ల దేశీయ ఉత్ప‌త్తి దారుల‌కు పెద్దగా ప్రయోజనం సమకూరదని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి