iDreamPost

వైఎస్‌ఆర్‌ ఆలోచనను జగన్‌ అమలు పరచాలంటున్న ఉండవల్లి

వైఎస్‌ఆర్‌ ఆలోచనను జగన్‌ అమలు పరచాలంటున్న ఉండవల్లి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ«శేఖరరెడ్డికి అత్యంత అప్తుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఓ అభ్యర్థన చేశారు. అదీ కూడా ఆయన తండ్రి వైఎస్‌ఆర్‌ ఆలోచనేనంటూ వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లేఖ రాశారు. 14 ఏళ్ల క్రితం తండ్రి చేసిన ఆలోచనను కొడుకు అమలు చేయాలంటూ విన్నవిస్తున్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో కర్నూలు, రాజమహేంద్రవరం నగరాల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదనలు పంపారట. కర్నూలులో ఈ డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉండగా.. రెండో బెంచ్‌ రాజమహేంద్రవరం ఏర్పాటు చేయడంపై అప్పట్లో ఎంపీగా ఉన్న తనతోపాటు, స్థానిక ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావుల అభిప్రాయాలను తీసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని ఉండవల్లి గుర్తు చేశారు.

2009లో వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదన గురించి పట్టించుకోలేదని ఉండవల్లి పేర్కొన్నారు. ప్రస్తుతం హైకోర్టునే కర్నూలు తరలిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఒక బెంచ్‌ ఏర్పాటు చేయాలంటున్నారు. ఇది తన విజ్ఞప్తి కాదని, మీ తండ్రి వైఎస్సార్‌ ఆలోచన అంటూ జగన్‌కు చెబుతూ రాజమహేంద్రవరం నగరానికి ఉన్న అనుకూలతలను వివరించారు. రవాణా పరంగా రాజమహేంద్రవంలో విమానాశ్రయం, రైలు, రోడ్డు కనెక్టవిటీ బాగా ఉందని చెబుతున్నారు. ఇందులో తన స్వార్థం కూడా ఉందని, ఇక్కడ బెంచ్‌ పెడితే తాను నల్లకోటు వేసుకొవచ్చంటూ మీడియా సమావేశంలో ముక్తాయించారు.

మూడు రాజధానుల ప్రతిపాదనలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించి… అమరావతి, విశాఖల్లో బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన జగన్‌ సర్కార్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆలోచనను గుర్తు చేస్తున్నారు. ఈ విషయంపై జగన్‌ సర్కార్‌ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా వైఎస్సార్‌.. కర్నూలు, రాజమహేంద్రవరంలో బెంచ్‌ల ఏర్పాటు ఆలోచన చేసుంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు రాజధాని హైదరాబాద్‌లో ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధానిగా కర్నూలును చేసి అక్కడే హైకోర్టు కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ 1956లో ఏర్పాటైనప్పుడు రాజధానిగా హైదరాబాద్‌ను ఎంపిక చేశారు. ఆ సమయంలోనే కర్నూలులో ఉన్న హైకోర్టును హైదరాబాద్‌కు తరలించారు. అప్పటి నుంచి కర్నూలులో బెంచ్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ప్రాంతీయ ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుకు ఆలోచన చేసి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. పనిలో పనిగా కోస్తా ఆంధ్రలో కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే అటు ఉత్తరాంధ్ర, ఇటు కోస్తా ఆంధ్రకు మధ్యలో ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని ఎంపిక చేసి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సమీకరణాలు మారాయి. అయినా విశాఖను కార్యనిర్వాహఖ రాజధానిగా చేస్తున్న సమయంలో ఉభయగోదావరి జిల్లా వాణిజ్య రాజధాని అయిన రాజమహేంద్రవరంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలన్న మాజీ ఎంపీ ఉండవల్లి అభ్యర్థన ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి