iDreamPost

తుఫాను తప్పినా.. వడగాడ్పుల ముప్పు..

తుఫాను తప్పినా.. వడగాడ్పుల ముప్పు..

సూపర్‌ సైక్లోన్‌ ఉంపన్‌ ముప్పు తీవ్రత తగ్గిపోయిందని అనుకునేలోపు రాష్ట్రంపై వడగాడ్పుల రూపంలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అయితే నేటి నుంచి మూడు రోజుల పాటు తీవ్రమైన వడగాడ్పుల ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోళ్లు పగిలే రోహిణి కార్తె ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకముందే వడగాడ్పులు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

దాదాపు 45 నుంచి 47 డిగ్రీల ఎండతోపాటు వడగాడ్పులు ఉంటాయని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేడివల్ల డీహైడ్రేషన్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని, అందువల్ల ఇంటి బయటకు రాకపోవడమే మేలని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఏటా ఎండల కారణంగా వందల సంఖ్యలో మరణాలు సంభవించేవి. అయితే ఈ ఏడాది లాక్‌డౌన్‌ వల్ల ప్రజలెవరూ బయటికి రాకపోవడం, ఎండలు కూడా అంతగా లేకపోవడంతో మరణాలు సంభవించలేదు.

కాగా, ఉంపన్‌ తుఫాను పశ్చిమబెంగాల్‌లో తీరం దాటింది. భీకరమైన గాలులతో.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతూ పశ్చిమ బెంగాల్‌బంగ్లాదేశ మధ్య సుందర్‌బన్‌ తీరం వద్ద బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీరం తాకింది. దీంతో ఒడిషా, పశ్చిమబెంగాల్‌ తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆ రాష్ట్రాల్లో హై అలర్ట్‌ కొనసాగుతోంది. తుపాను ప్రభావం వల్ల మన రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సముద్రం కాస్త అల్లకల్లోలంగా మారినప్పటికీ.. ఎక్కడా పెద్దగా ఆస్తి నష్టం సంభవించలేదు. ఇప్పటికే అకాలవర్షాలతో దెబ్బతిన్న రైతులకు ఇది ఊరటనిచ్చే అంశం. దాని ప్రభావం గురువారం నాటికి రాష్ట్రంపై పూర్తిగా తగ్గిపోతుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి