iDreamPost

CM జగన్ పై దాడి.. తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

  • Published Apr 14, 2024 | 3:03 PMUpdated Apr 14, 2024 | 3:03 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Apr 14, 2024 | 3:03 PMUpdated Apr 14, 2024 | 3:03 PM
CM జగన్ పై దాడి.. తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాడిపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేటీఆర్ తో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ఈ ఘటనను ఖండించడమే కాక.. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా.. కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. ఆ వివారాలు..

ఏపీ సీఎం జగన్ మీద. శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాళ్ల దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనపై ఆరా తీసిన ఈసీ.. పూర్తి వివరాలతో నివేదిక కోరింది. అంతేకాక ఎన్నికల వేళ వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలు చోటు చేసుకోవడంపై ఈసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత నెల చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ సభ, ఇప్పుడు విజయవాడలో సీఎం జగన్ రోడ్‌షోలో రాళ్లదాడిపై పలు ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించింది. ఇప్పటికే ప్రధాని మొదీ సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్రంగా స్పందించిన ఈసీ.. ఐజీ, ఎస్పీలపై వేటు వేసిన సంగతి తెలిసిందే.

ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అంతేకాక ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి ఈసీకి అందజేయనున్నారు. అంతేకాక అనుమానితుల మొబైల్ డేటాను కూడా సేకరించనున్నారు.

ఇక, సీఎం జగన్ పై దాడి ఘటనతో తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాక.. యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.దాడి నేపథ్యంలో నేతలు, వీఐపీల భద్రతపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రికి.. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీతో పాటు సీఎం సెక్యూరిటీ, ఎస్కార్ట్‌, పెరిఫెరీ ఇలా వందల మందితో భద్రత కల్పిస్తారు. వీరితో పాటు స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనంగా ఉంటుంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికి.. సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం అవుతుంది అంటున్నారు రాజకీయ పండితులు. తాజా దాడి ఘటనపై ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి