iDreamPost

Kurup : ఈ విషయంలో మెచ్చుకోవాల్సిన మలయాళం హీరో

Kurup : ఈ విషయంలో మెచ్చుకోవాల్సిన మలయాళం హీరో

ఎల్లుండి విడుదల కాబోతున్న కురుప్ మీద కేరళలో భారీ అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్స్ దుల్కర్ సల్మాన్ కెరీర్ బెస్ట్ వస్తాయనే నమ్మకంతో ట్రేడ్ దీని మీద భారీ పెట్టుబడులు పెట్టింది. తెలుగు వెర్షన్ కూడా అదే రోజు రాబోతోంది. అయితే ఇక్కడ ఏమంత బజ్ లేదు. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో కనీస వసూళ్లు వస్తాయా అనే అనుమానం లేకపోలేదు. అలా అని యూనిట్ ఊరికే వదిలేయడం లేదు. కంటెంట్ మీద నమ్మకంతో నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. ప్రత్యేకంగా టాలీవుడ్ అతిధులు ఎవరినీ పిలవలేదు కానీ ఉన్నంతలో ఘనంగా నిర్వహించడంతో అంతో ఇంతో ప్రేక్షకుల దృష్టి దీని మీద పడింది.

ఇందులో విశేషం ఏమి లేదు కానీ దుల్కర్ ని ప్రత్యేకంగా ప్రశంసించడానికి కారణం అతని కమిట్ మెంట్. తెలుగు రాకపోయినా నేర్చుకుని మరీ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం. కురుప్ మాత్రమే కాదు గతంలో వచ్చిన కనులు కనులను దోచాయంటే, మహానటిలో కూడా తన గొంతే వినిపించాడు.ఇది నాన్న మమ్ముట్టి నుంచి నేర్చుకున్న శైలి. స్వాతికిరణం, సూర్య పుత్రులు, యాత్ర లాంటి స్ట్రెయిట్ మూవీస్ తో పాటు దళపతి లాంటి డబ్బింగ్ చిత్రాలకు కూడా ఆయనే వాయిస్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్నే దుల్కర్ అందిపుచ్చుకున్నాడు. మీడియా ఇంటర్వ్యూలలో సైతం దుల్కర్ స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుతున్నాడు.

ఇప్పటికీ కొందరు సీనియర్ స్టార్లు టాలీవుడ్ లో ధారాళంగా తెలుగులో మాట్లాడలేరు. తమిళం కొంచెం ఇంగ్లీష్ కొంచెం మిక్స్ చేయకుండా సంభాషణ పూర్తి కాదు. ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నా ఈ విషయంలో వెనుకబడిన వాళ్ళు గట్టిగానే ఉన్నారు. కానీ పట్టుమని పది కూడా తెలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ కానీ దుల్కర్ ఇలా చేయడం మాత్రం మెచ్చుకునేదే. కురుప్ అనే రియల్ గ్యాంగ్ స్టర్ కథతో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ మనవాళ్లను కూడా బాగానే ఆకట్టుకుంది. పోటీగా రాజా విక్రమార్క, పుష్పక విమానంలు వస్తున్నాయి కానీ కురుప్ కంటెంట్ కనక సాలిడ్ గా ఉంటే అదేమంత ఫీలయ్యే కాంపిటీషన్ కాదు

Also Read : Naatu Naatu : తారక్ చరణ్ మాస్ మూమెంట్స్ అదిరాయిగా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి