iDreamPost

దిశా నిందితుల రీ పోస్టుమార్టం ప్రారంభం

దిశా నిందితుల రీ పోస్టుమార్టం ప్రారంభం

హైకోర్టు ఆదేశాల మేరకు దిశా నిందితుల రీ పోస్టుమార్టం ప్రారంభమయ్యింది. ఢిల్లీ ఎయిమ్స్ నుండి వచ్చిన ముగ్గురు ప్రత్యేక వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించడానికి హైదరాబాద్ వచ్చారు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల లోపు పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం పోస్టుమార్టం ప్రారంభించారు.

ఇప్పటికే మృతదేహాల అంతర్గత భాగాలు సగం పాడయ్యాయని ఇంకా ఎక్కువ రోజులు దాచి ఉంచలేమని ఇంకో ఐదు రోజుల్లో మృతదేహాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శ్రవణ్‌ కుమార్‌ హైకోర్టులో తెలిపారు. దానితో 23 తేదీ సాయంత్రం ఐదుగంటల లోపు దిశా నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ సోమవారం ఉదయం రీ పోస్టుమార్టానికి అవసరమైన ఏర్పాట్లను గాంధీ ఆసుపత్రి వర్గాలు సిద్ధం చేయడంతో ప్రత్యేక ఫోరెన్సిక్ వైద్యుల బృందం పోస్టుమార్టం ప్రారంభించింది. ఒక్కో మృతదేహానికి సుమారు గంటన్నర సమయం కేటాయించి రీ పోస్టుమార్టం చేయనున్నట్లు సమాచారం. పోస్టుమార్టానికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్ లో భద్రపరచి సుప్రీం కోర్టు నియమించిన జ్యుడీషియల్‌ కమిషన్‌కు ప్రభుత్వ అధికారులు అందజేయనున్నారు.

పోస్టుమార్టం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు.పోస్టుమార్టం జరిగే సమయంలో ఎవరినీ మార్చురీలోకి అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి