iDreamPost

జగన్‌ ఆస్తుల కేసు17కు వాయిదా

జగన్‌ ఆస్తుల కేసు17కు వాయిదా

ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారిగా వైఎస్‌ జగన్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు హాజరైన నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనేక అనుమానాలు, అంచనాలు పటాపంచలయ్యేలా ప్రశాంతంగా విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటల సమయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులతో కలసి సీఎం జగన్‌ నాంపల్లిలోని కోర్టుకు హాజరయ్యారు.

ఈడీ కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్‌ కోరారు. గతంలో తన తరఫున న్యాయవాది హాజరవుతున్నారని పిటిషన్‌ దాఖలు చేసిన జగన్‌ ఈసారి తన తరఫున ఈ కేసులో ఉన్నమరో వ్యక్తి హాజరవుతారని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి (17వ తేదీ) వాయిదా వేసింది. వచ్చే వారం జగన్ హాజరుపై స్పష్టత రావాల్సి ఉంది.

Read Also: నేడు సీబీఐ కోర్టుకు జగన్

కాగా, వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ నేత, అప్పుటి ఎమ్మెల్యే పదవిలో ఉన్న శంకరరావు జగన్‌ అక్రమంగా ఆస్తులు సంపాదించారని, విచారణ జరపాలంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు టీడీపీ దివంగత ఎంపీ కింజారపు ఎర్రన్నాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై 2011లో సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పలువరు ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను విచారించింది. సీఎం జగన్‌ ఆస్తులను అటాచ్‌ చేయడం, సాక్షి దినపత్రిక ఖాతాలను జప్తు చేసింది. జగన్‌కు చెందిన పలు కార్యాయాల్లో సోదాలు నిర్వహించింది.

ఈ కేసుల్లో 2012 మే 23న విచారణకు హాజరు కావాలని జగన్‌కు నోటీసులు జారీ చేసిన సీబీఐ మరో మూడు రోజులకు అంటే.. మే 27న అరెస్ట్‌ చేసింది. పలుమార్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో, హైకోర్టు, సుప్రిం కోర్టులోనూ జగన్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దాదాపు 16 నెలల తర్వాత అత్యున్నత న్యాయస్థానాల సూచనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2013 సెప్టెంబర్‌లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ షరతులలో ప్రతి వారం విచారణకు హాజరుకావాలన్నది ప్రధానమైనది. అప్పటి నుంచి సీఎం అయ్యే వరకూ ప్రతి వారం కోర్టుకు హాజరవుతున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న సమయంలో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించలేదు.

Read Also: రాజధాని అంశం.. నేడు ఓ కొలిక్కి తెస్తారా..?

అయితే 2019 మేలో జరిగిన ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక మళ్లీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఈ రోజు విచారణకు తప్పక హాజరు కావాలని సమన్లు జారీ చేయడంతో సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన విచారణకు హాజరయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి