iDreamPost

ఒకే రాజధాని వద్దు – మూడు రాజధానులు ముద్దు

ఒకే రాజధాని వద్దు – మూడు రాజధానులు ముద్దు

వికేంద్రీకరణ కోసం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,వైసీపీ ఎంపీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు.రాయలసీమ ప్రాంతం వాళ్ళయిన చంద్రబాబు 14 సంవత్సరాలు, కిరణ్ కుమార్ రెడ్డి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, చంద్రబాబు ఇక్కడ యూనివర్సిటీలోనే చదువుకున్నారని తెలిపారు. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రం కృషి చేయలేదని కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం రాయల సీమలో 2 యూనివర్సిటీలు ప్రకటించారని వ్యాఖ్యానించారు.

రాయలసీమ అభివృద్ధి జరగకుండా జగన్ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని,మూడు రాజధానులు ముద్దని భూమన పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని, నిరుద్యోగం తగ్గి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భూమన చెప్పుకొచ్చారు. రాయలసీమవాదులుగా, రాయలసీమ బిడ్డలుగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నామని స్పష్టం చేసారు. ఒకే రాజధాని వద్దు – మూడు రాజధానులు ముద్దని నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కు తమ మద్దతును తెలిపారు.

చంద్రబాబు ఖాళీగా ఉండలేక జోలెపట్టి విరాళాలు సేకరిస్తున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు 8.5 లక్షల కోట్లు దోచుకున్నారని ఎద్దేవా చేసారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. థాంక్యూ సీఎం అంటూ రాసిన ప్లకార్డులతో వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని ర్యాలీలో నినాదాలు చేయడం విశేషం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి