iDreamPost

నల్లపూసైన నారాయణ..

నల్లపూసైన నారాయణ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా ఒక్క అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానులను ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆందోళనలను తీవ్రతరం చేశారు. అమరావతి పరిరక్షణ పేరుతో జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరికొంత మంది మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే రాజధాని విషయంలో ముఖ్యపాత్ర పోషించిన ఓ మాజీ మంత్రి కనిపించడంలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆ మాజీ ప్రజా ప్రతినిధి ఎక్కడున్నారో వెతుకుతున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలోకానీ, పేపర్లలోకానీ ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారేమోనని ప్రతి రోజూ ఆసక్తిగా వెతుకుతూ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ ప్రజా ప్రతినిధి ఎవరంటే.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ.

2014 ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా రాష్ట్ర ప్రజలకు, రాజకీయ నాయకులకు విద్యాసంస్థ అధినేతగా మాత్రమే నారాయణ తెలుసు. చంద్రబాబు తన మంత్రివర్గ ప్రమాణస్వీకారం ముందు రోజు కూడా నారాయణ పేరు ఎక్కడా వినిపించలేదు. ఒక్కసారిగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారాయణ రాష్ట్ర ప్రజలను, రాజకీయ పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులను ఆశ్యర్యంలో ముంచెత్తారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఆర్థికపరమైన మద్దతు ఇచ్చారని, ఎన్నికల్లో ఖర్చు భరించిన నేపథ్యంలోనే ఏ సభలో కూడా సభ్డ్యుడుకానీ నారాయణకు మంత్రిపదవి ఇచ్చారని అప్పట్లో చర్చించుకున్నారు.

కేవలం మంత్రి పదవి ఇవ్వడమే కాదు, అత్యంత ముఖ్యమైన రాజధాని ఎంపిక, ఆ తర్వాత భూముల సేకరణ/సమీకరణ వంటి అన్ని అంశాల్లో నారాయణే ముఖ్యపాత్ర పొషించారు. రాజధాని ప్రాంత ఎంపికపై నారాయణ సారధ్యంలోనే చంద్రబాబు కమిటీని నియమించారంటే ఆయనకు ఏ స్థాయిలో ప్రాధాన్యం దక్కిందో అర్థం చేసుకోవచ్చు. భూముల వ్యవహారానికి సంబంధించిన రెవెన్యూ శాఖ, ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న టీడీపీ సీనియర్‌ నేత కేఈ కృష్ణమూర్తికి రాజధాని భూముల సేకరణ/సమీకరణలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం, నారాయణే ఈ బాధ్యతలు నిర్వర్తించడం ఇక్కడ గమనార్హం.

రాజధాని అమరావతిపై ఇలా కీలక ప్రాత పొషించిన పొంగూరు నారాయణ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అడపాదడపా మాత్రమే రాజకీయాల్లోనూ, టీడీపీ కార్యక్రమాల్లో కనిపించారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భూములు కొన్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపణలు చేయడం లేదా మీడియాలో కథనాలు వచ్చిన సమయంలో మాత్రమే వాటిని ఖండించేందుకు మీడియా ముందుకు వచ్చారు. తాజాగా ఇటీవల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వైఎస్సార్‌సీపీ వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చిన రోజున తనపై ఆరోపణలను ప్రెస్‌మీట్‌లో ఖండించారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.

తాజాగా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం, అమరావతి ఒక్కదాన్నే రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు ఉద్యమం చేస్తున్నారు. బస్సు యాత్రల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటింస్తున్నారు. అమరావతి కోసం బాబు ఇంతలా కష్టపడుతుంటే.. రాజధాని వ్యవహారాలను అన్నీ తానై నడిపిన పొంగూరు నారాయణ ప్రస్తుతం మచ్చుకు కూడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి