iDreamPost

వారిని బీజేపీలోకి పంపి తప్పు చేశామా?

వారిని బీజేపీలోకి పంపి తప్పు చేశామా?

రాజ్యసభ ఖాళీలకు నోటిఫికేషన్‌ వెలువడిన వేళ.. మాజీ సీఎం చంద్రబాబులో అంతర్మథనం మొదలయ్యిందట. రాజకీయంగా తన సేఫ్టీ కోసం బీజేపీలోకి తమ పార్టీ రాజ్యసభ సభ్యులను చేర్చిన ఎత్తుగడ ఒకవైపు విఫలం కాగా, మరోవైపు పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బలహీనమవడంపై సన్నిహితుల వద్ద వాపోతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా చేజేతులా రాజ్యసభలో ఏకాకిగా మిగిలిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కేంద్రంలో వచ్చే ఐదేళ్ల పాటు తనను పట్టించుకునే వారే ఉండరని, రాబోయే ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నారట. అదే సమయంలో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం పెరుగుతుండడం జీర్ణించుకోలేకపోతున్నారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. తన ఐదేళ్ల హయాంలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసే విచారణలతో ఇబ్బందులు తప్పవనే ఉద్ధేశ్యంతో చంద్రబాబు మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎందుకైనా మంచిదని నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావులను బీజేపీలోకి పంపిన విషయం బహిరంగ రహస్యమే. ఈ నలుగురూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన విషయం అందరికీ తెలిసిందే. కొన్నాళ్ల పాటు బీజేపీలో సుజనా, టీజీ, రమేశ్‌ బాగానే తిరిగారు. చంద్రబాబు ఎజెండాను మోస్తూ బీజేపీలో తమ స్థానం పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే వీరిలో చంద్రబాబు తాలూకూ అజెండా ఉన్నట్లు గుర్తించిన బీజేపీ అధిష్టానం వారికి చెక్‌పెట్టింది. దీంతో చంద్రబాబు ఉద్దేశ్యం నెరవేరలేదు. ఆయనకు బీజేపీ అండదండలు దక్కలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతారామలక్ష్మి మాత్రమే మిగిలిపోయారు. వీరిద్దరిలో తోట సీతారామలక్ష్మి పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఇక కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే టీడీపీ తరఫున రాజ్యసభలో మిగులుతారు.

ఇదే సమయంలో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం ఆరుగురు పెరగనుంది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని విషయాల్లో వైఎస్సార్‌సీపీ సహకారం అవసరముంది. ఆ నలుగురిని బీజేపీలోకి పంపకుండా ఉంటే తనకూ ప్రాధాన్యం ఉండేదని, కనీసం కొన్ని విషయాల్లోనైనా కేంద్రంతో బేరాలు ఆడడానికి అవకాశం ఉండేదని భావిస్తున్నారట. ఇప్పుడు ఏమి ఆలోచించినా ప్రయోజనం ఉండదని తెలిసినా, ఆయన ఆవేదన మాత్రం తీరడం లేదట. సన్నిహితుల వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన బేల తనాన్ని బయటపెట్టుకుంటున్నారట.

మొత్తంగా నలుగురు సభ్యులే పార్లమెంటులో ఉండటంతో ప్రాధాన్యత కోల్పోతామని, అత్యంత హీన స్థితికి పార్టీ దిగజారిపోతోందని టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఇంతటి ఇబ్బందికర పరిస్థితి ఎప్పుడూ రాలేదని సీనియర్‌ నేతలు సైతం చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ బలం 2024కి మరింతగా పెరుగుతుందని, అప్పటికి ఆ పార్టీ ముందు తమ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతుందని విశ్లేషిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి