వరల్డ్ కప్ 2023లో ఎట్టకేలకు బోణీ కొట్టింది ఆస్ట్రేలియా. సోమవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అభిమానులు, నెటిజన్లు వార్నర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ వార్నర్ చేసిన ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం.
డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా ప్లేయర్ అయినప్పటికీ ఇండియాతో మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా.. తెలుగు పాటలకు తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అదరగొట్టేవాడు. దీంతో అతడికి ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అభిమానుల మనసు గెలుచుకున్నాడు వార్నర్ భాయ్. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఇన్నింగ్స్ 32.1వ ఓవర్ దగ్గర వర్షం వచ్చింది. భారీ గాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా రావడంతో.. ఆటగాళ్లు అందరూ డగౌట్ వైపు పరుగు తీశారు. కానీ డేవిడ్ వార్నర్ ఒక్కడే తనలో ఉన్న సేవా గుణాన్ని చూపుతూ.. వర్షపు కవర్ లను మైదానంలోకి తీసుకొచ్చేందుకు గ్రౌండ్ స్టాప్ తో కలిసి పరిగెత్తాడు. బౌండరీ లైన్ దగ్గరి నుంచి పిచ్ వరకు స్టాప్ తో కలిసి కవర్ పట్టుకుని పరిగెత్తాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు వార్నర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆసీస్ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో నిస్సాంక(61), కుశాల్ పెరీరా(78) టాప్ స్కోరర్లుగా నిలువగా.. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో లంక నడ్డివిరిచాడు. అనంతరం 210 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(52), జోష్ ఇంగ్లీస్(58) అర్ద సెంచరీలతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. మరి వార్నర్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
David Warner leads a helping hand to the ground staff 🤝#CWC23 #AUSvsSL #DavidWarner pic.twitter.com/N6yFIJ5T8d
— Malik Farooq (@EngrM_Farooq) October 16, 2023