iDreamPost
android-app
ios-app

పీజీ వైద్య విద్యార్థిని సింధూజ అనుమానాస్పద రీతిలో మృతి

పీజీ వైద్య విద్యార్థిని సింధూజ అనుమానాస్పద రీతిలో మృతి

వరంగల్ కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించి ఐదు రోజుల పాటు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇప్పుడు మరో పీజీ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడింది. ఆమె స్వస్థలం తమిళనాడులో కాగా, కర్ణాటకలో కన్నుమూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన వెంకటా చలం కుమార్తె సింధూజ.. స్వరాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. పీజీ అనస్తీషియా (మత్తు) కోర్సుకు అర్హత సాధించడంతో కర్ణాటకలోని కొళ్లేగాల ప్రభుత్వ ఉప విభాగంలో సీటు వచ్చింది. గత ఎనిమిది నెలలుగా ఆ ఆసుప్రతిలో చదువుకుంటూ, డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. శ్రీ మహాదేశ్వర కాలేజీ రోడ్డులో అద్దె ఇంట్లో నివాసముంటోంది.

కాగా, శుక్రవారం ఆమె విధులకు హాజరు కాలేదు. దీంతో ఎందుకు రాలేదో కనుక్కుందామని మరో డాక్టర్ లోకేశ్వరి.. ఆమెకు కాల్ చేసింది. అయితే డాక్టర్ సింధూజ కాల్ లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆమె విధులకు హాజరు కాకపోగా.. సింధూజ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానం వచ్చి ఆసుపత్రి సిబ్బందిని ఆమె ఇంటికి వెళ్లి చూసి రావాలని పంపారు. అక్కడకు వెళ్లిన వ్యక్తి తలుపు కొట్టినా తీయకపోయేసరికి, కిటీకీలో నుండి చూడగా.. సింధూజ నేలపై బోర్లా పడి ఉండటాన్ని చూశారు. పక్కనే ఇంజెక్షన్, చాక్ కనించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఆసుపత్రి సిబ్బంది. పోలీసులు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా.. సింధూజ చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఆమె ఇంజెక్షన్ ద్వారా విషపూరిత పదార్థాలు తీసుకుని చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతికి కారణాలకు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.