iDreamPost

ప్రియుడితో సహజీవనం.. యాసిడ్ దాడి చేసిన మహిళ

ప్రియుడితో సహజీవనం.. యాసిడ్ దాడి చేసిన మహిళ

పెళ్లి నాటి ప్రమాణాలను గంగలో తొక్కేసి, పరాయి వ్యక్తుల మోజులో పడి తిరుగుతున్నారు. కేవలం పురుషులే కాదూ పెళ్లైన మహిళలు సైతం పెడదోవపడుతున్నారు. దీని వల్ల అనార్థాలు చోటుచేసుకోవడంతో పాటు కుటుంబ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థంగా మారిపోతుంది. తాజాగా గుంటూరు జిల్లాలో ప్రియుడు మోసం చేశాడన్న కక్షతో అతడిపై యాసిడ్ దాడి చేసిందో మహిళ. తనతో సహజీవనం చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడని ఆమె ఈ దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన వెంకటేష్.. వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. ఇంటింటికీ వాటర్ క్యాన్స్ చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో నగరంలోని రామిరెడ్డి తోటలో ఉండే రాధ అనే వివాహిత పరిచయం అయ్యింది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరాకు చెందిన రాధకు గతంలో పెళ్లికాగా, భర్త లేడు. నల్లపాడు వచ్చి అక్కడే ఉంటూ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రాధతో వెంకటేష్ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం వెంకటేష్.. రాధను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే రాధను తీసుకురావడం నచ్చని వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుండి బయటకు పంపించేశారు. దీంతో వెంకటేష్, అతని కుటుంబ సభ్యులు తనపై దాడి చేసి ఇంటి నుండి గెంటేశారంటూ రాధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వెంకటేష్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తనను బయటకు గెంటేశారన్న కోపంతో వెంకటేష్‌పై పగ పెంచుకుంది రాధ.

మంగళవారం ముగ్గురు యువకులతో కలిసి ఆటోలో వెళ్లిన రాధ.. వెంకటేశ్ ఎక్కడున్నాడో కనుక్కొని, మంచి నీళ్ల డబ్బాలు దించుతుండగా.. వెనుక నుండి అతడిపై యాసిడ్‌తో దాడి చేసింది. అతడు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. యాసిడ్ పోసిన వెంటనే.. వచ్చిన ఆటోలోనే పరారయ్యింది రాధ.. ఆమె బృందం. యాసిడ్ గాయాలతో విలవిలాడుతున్న వెంకటేష్‍ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వెంకటేష్ మాట్లాడుతూ.. తనను చంపేస్తానని రాధ బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాధతో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి