iDreamPost

కరోనా ‘కోటి’

కరోనా ‘కోటి’

ఏదైనా దేవుడి పేరును కోటిసార్లు స్మరించుకోవడం గానీ, రాయడం గానీ చేస్తుంటారు ఆధ్యాత్మికచింతనాపరులు. కానీ 2020 యేడాది మాత్రం కరోనా అలియాస్‌ కోవిడ్‌ 19 అందరిచేతా కరోనా కోటికిపైగా స్మరింపజేసేసింది. కాలుతీసి బైటపెట్టాలన్న ప్రతి సారీ కరోనాయే గుర్తు వచ్చేంత రీతిలో దాదాపు ఎనిమిది నెలలుగా జనజీవనాన్ని ట్వంటీట్వంటీ మ్యాచ్‌ ఒన్‌సౌడ్‌గా ఆడేసుకుంది. దేశంలో కేరళలో మొదటి సారిగా ఒక్క కేసుతో మొదలై ప్రస్తుతానికి కోటికిపైగా పాజిటివ్‌ కేసులు దేశంలో నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు.

దేశంలో గుర్తించిన పాజిటివ్‌ల సంఖ్య ఇప్పటి వరకు 1,00,04,620లుగా ఉంది. ఈ వ్యాధి కారణంగా 1,45,167 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాప్తి నెమ్మదించినట్లు నమోదవుతున్న కేసులను బట్టి అంచనా వేస్తున్నారు. అయితే ఇది సెకెండ్‌వేవ్‌ ప్రారంభం కావడానికి ముందున్న పరిస్థితి అని పలువురు నిపుణులు అభిప్రాయ పడడం ఆందోళన కల్గిస్తోన్న అంశం.

ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికం అయిదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు బైటపడ్డాయి. ఈ అయిదే రాష్ట్రాల్లోనూ 11 జిల్లాల్లో లక్షకుపైగా పాజిటివ్‌లు వెలుగుచూసాయి. 18,88,767 కేసులతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ 60వేలకుపైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 9,07,123 కేసులు కర్నాటకలో బైటపడగా 15,380 యాక్టివ్‌కేసులున్నాయి. 8,77,800 కేసులు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించగా ప్రస్తుతం 4,377 యాక్టివ్‌ కేసులున్నాయి. 8,04,650 పాజిటివ్‌లను తమిళనాడులో బైటపడగా ఇప్పుడు 9,781 యాక్టివ్‌ కేసులున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 6,93,866 కేసులు కేరళలో నమోదుకాగా 58,895 యాక్టివ్‌గా ఉన్నాయి.

ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిస్సా, రాజస్థాన్‌ రాష్ట్రాలు మొదటి నుంచి పది స్థానాల్లో ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది.

టాప్‌ 5లో ఉన్నా యాక్టివ్‌ కేసులు తక్కువే..

అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ టాప్‌ 5లో ఉన్నప్పటికీ ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం తక్కువగానే ఉంది. టాప్‌ 5లోని ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే యాక్టివ్‌ కేసులు (4,377 మాత్రమే) ఇప్పుడు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు పేర్కొన్నాయి. ఇందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలే కారణమని పలువురు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. విస్తృతంగా టెస్టులు చేయడం ద్వారా కోవిడ్‌ వ్యాప్తిని గణనీయంగానే ఏపీ ప్రభుత్వం పరిమితం చేయగలిగిందని వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను బట్టి రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి