iDreamPost

క‌రోనాతో సినిమాల‌కి దెబ్బ‌

క‌రోనాతో సినిమాల‌కి దెబ్బ‌

అస‌లే సినిమాల‌కి ఇది అన్‌సీజ‌న్‌. ప‌రీక్ష‌ల కాలం. అందుక‌ని మార్చి, ఏప్రిల్‌లో ఆచితూచి రిలీజ్ చేస్తారు. ఇప్పుడేమో హైద‌రాబాద్‌లో క‌రోనా అంటున్నారు. ఆ పేరు వింటేనే ప్ర‌పంచ‌మంతా వ‌ణుకుతోంది. క‌రోనా బీర్ అమ్మ‌కాలు కూడా ప‌డిపోయాయి. ఇంకో మూడు రోజుల్లో అంటే 6వ తేదీ అనేక చిన్న సినిమాలు వ‌స్తున్నాయి. అస‌లే వాటికి ప్రేక్ష‌కులు అంతంత మాత్రం. ఇక క‌రోనా భ‌యం ప‌ట్టుకుంటే అంతే. అద్దెలు కూడా రావు. నైజాంలో హైద‌రాబాద్‌దే సింహ‌భాగం. మ‌ల్టీ ఫ్లెక్స్‌లు నిండితేనే డ‌బ్బులు. ఆఫీస్‌లు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఎలాగూ త‌ప్ప‌వు. అయితే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫుడ్ బిజినెస్‌ల‌పై ఈ భ‌యం తీవ్రంగా ఉంటుంది.

ఇప్ప‌టికే పుకార్ల వ‌ల్ల పౌల్ట్రీ రంగం తీవ్రంగా దెబ్బ‌తినింది. చికెన్‌, గుడ్లు ధ‌ర‌లు దారుణంగా ప‌డిపోయాయి. సిటీలో ప్ర‌ధాన‌మైన వ్యాపారం నాన్ వెజ్ రెస్టారెంట్లే. క‌రోనా భ‌యంతో వేలాది మంది ఉపాధి దెబ్బ‌తింటుంది. విమాన ప్ర‌యాణాలు, ముఖ్యంగా విదేశాల‌కు వెళ్లే వాళ్లు త‌గ్గిపోతున్నారు. బ‌స్సులు, రైళ్ల‌పై కూడా ఈ ప్ర‌భావం ఉండొచ్చు.

నిజానికి క‌రోనా వైర‌స్ వ్యాపిస్తే , మ‌న దేశం చేతులెత్తేస్తుంది. చైనా లాంటి క్ర‌మ‌శిక్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌న‌కు లేదు. కేవ‌లం రోజుల్లో వాళ్లు అతి పెద్ద ఆస్ప‌త్రి క‌ట్ట‌గ‌లిగారు. మ‌న దేశంలో అయితే టెండ‌ర్లు పిలిచి ఖ‌రారు చేసేస‌రికి క‌రోనా అయినా పోతుంది, లేదంటే జ‌న‌మైనా పోతారు.

మామూలు జ్వరాల‌కే మ‌న ద‌గ్గ‌ర మందులుండ‌వు. గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి వెళ్లాలంటేనే భ‌యం మ‌న‌కి. ఇక క‌రోనా పేషేంట్లు వ‌స్తే ముందు డాక్ట‌ర్లు, న‌ర్సులు సెల‌వు పెట్టి వెళ్లిపోతారు.

ఇంకో విష‌యం ఏమంటే త‌మ‌కి క‌రోనా సోకింద‌ని కూడా సామాన్య జ‌నానికి తెలియ‌దు. నాలుగు తుమ్ములు వ‌చ్చి ముక్కు కారితే మిరియాల క‌షాయం తాగేస్తాం. ఇక క‌రోనా పేరుతో ర‌క‌ర‌కాల వైద్యాలు కూడా వ‌చ్చేస్తాయి. ఒక‌డు గోమూత్రం తాగితే పోతుందంటాడు. ఆవు పేడ ముక్కుకి రాసుకుని నిద్ర‌పోతే ఆ వాస‌న‌కి క‌రోనా ప‌రార‌వుతుందంటాడు.

శుభ్ర‌త , మాస్క్‌ల వాడ‌కం కంటే, దేశీయ వైద్య విధానాల గోల ఎక్కువై పోతుంది. య‌జ్ఞాలు , యాగాలు కూడా జ‌రుగుతాయి. జ‌పాలు, త‌పాలు, పూజ‌లు, పున‌స్కారాలు ఇంకా ఎన్నెన్ని చూడాలో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి