iDreamPost

కళ పెరిగిన ‘చిన్న’ పట్టణాలు..

కళ పెరిగిన ‘చిన్న’ పట్టణాలు..

పల్లె– పట్నంకు ఎంత తేడా ఉంటుందో చిన్న పట్టణం– నగరానికి అంతే తేడా ఉంటుంది. నగరీకరణ గత ఇరవయ్యేళ్ళుగా ప్రతియేటా పెరిగిపోతూనే ఉంది. దీంతో నగరాల విస్తీర్ణం కూడా అదే రీతిలో పెద్దదవుతోంది. అయితే హఠాత్తుగా వచ్చిపడ్డ కోవిడ్‌ నగర జీవన గతుల్ని మార్చేస్తోందంటున్నారు నిపుణులు. సాధారణంగా నగరాలకు వచ్చే వలసలకు ప్రదాన కారణాలు రెండు. వాటిలో ఒకటి ఉద్యోగం కాగా రెండు విద్య. కోవిడ్‌ కారణంగా ఈ రెండింటికీ ఆటంకం కలిగింది. దీంతో ఉద్యోగులు, విద్యార్ధులు తమతమ సొంత ప్రాంతాలకు చేరేపోయారు. దీని ప్రభావం ఆయా నగరాలపై ఇప్పుడు ప్రత్యక్షంగానే కన్పిస్తోంది.

మరోపక్క కోవిడ్‌ విజృంభణ నగరాల్లోనే అధికంగా నమోదవుతుండడంతో అక్కడికి ఇతర కారణాలతో వలస వెళ్ళిన వారు కూడా తమ సొంత ప్రాంతాలకొచ్చేసారు. ఈ నేపథ్యంలోనే నగర వాతావరణం, వ్యాపారాలు, సామాజిక జీవనం వంటి వాటిలో ఎన్నో గుర్తించదగ్గ మార్పులు ఇప్పుడు కన్పిస్తున్నాయంటున్నారు. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ వాతావరణంలో మార్పులు ఇప్పటికే గుర్తించారు. అలాగే వివిధ రకాల వ్యాపారాలు నగరాల్లో పూర్తిగా దెబ్బతిన్నట్టుగా పలు సర్వేల్లో తేలింది.

అదే సమయంలో చిన్నపట్టణాల్లో మాత్రం సదరు వ్యాపారాలు గతానికింటే రెంట్టింపు అభివృద్ధిని నమోదు చేయడం గమనార్హం. తద్వారా నగరాల నుంచి వెనక్కి వెళ్ళిన వారంతా చిన్నపట్టణాలు, పల్లెలకు చేరడంతో అక్కడ వ్యాపారాలు పుంజుకున్నాయని అంచనా వేస్తున్నారు. పేరొందిన ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలు తమ నెలవారీ నివేదికల్లో చిన్న పట్టణాలు, నగరాల్లోని తమ అమ్మకాల్లో వచ్చిన మార్పులను స్పష్టం చేయడంతో ఈ తేడా ఇప్పుడు బైటకు వెల్లడైందంటున్నారు.

కార్పొరేట్‌ సెక్టారే కాకుండా చిన్న పట్టణాల్లో ఇతర వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు కూడా అన్‌లాక్‌ తరువాత పుంజుకున్నట్టుగా అక్కడి వారు చెబుతుండడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో పెద్దపెద్ద పట్టణాల్లో టు–లెట్‌ బోర్డుల సంఖ్య పెరగడాన్ని సామాజికంగా అక్కడ సంభవించిన మార్పుగా సూచిస్తున్నారు. కోవిడ్‌కు ముందు వరకు అద్దె ఇళ్ళకోసం విపరీతమైన డిమాండ్‌ ఉన్న పలు పెద్ద పట్టణాల్లో ఇప్పుడు అనేక ఇళ్ళు టు–లెట్‌ బోర్డులతో దర్శనమిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

పట్టణీకరణ నేపథ్యంలో పల్లెలు కళతప్పితే, నగరీకరణ నేపథ్యంలో చిన్నపట్టణాలు కూడా అదే ఇబ్బందిని ఎదుర్కొన్నాయి. అయితే కరోనా కారణంగా ఇప్పుడు చిన్న పట్టణాలకు కళ పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది శాశ్వతమా? కాదా? అన్నది తేల్చడం ఒక్క కరోనాకే సాధ్యమవుతోందంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి