iDreamPost

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని పోలీసుల కారునే ఆపిన సామాన్యుడు.. వైరలవుతోన్న వీడియో

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని పోలీసుల కారునే ఆపిన సామాన్యుడు.. వైరలవుతోన్న వీడియో

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ పోలీస్ అధికారులు ట్రాఫిక్ రూల్స్ ను అమలు చేస్తుంటారు. ఓవర్ స్పీడు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, రాంగ్ రూట్ ప్రయాణం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనాన్ని నడిపి ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు వాహనదారులు. కాగా ఈ విధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధిస్తుంటారు అధికారులు. అయితే కొన్ని సందర్భాల్లో రూల్స్ ను అమలు చేయాల్సిన కొందరు పోలీస్ అధికారులు నియమాలను అతిక్రమిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు సామాన్యుల చేత నిలదీయబడతారు. ఇదే రీతిలో ఓ రాష్ట్రంలో పోలీస్ అధికారులు ప్రయాణిస్తున్న వాహనంలో వారు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తుండడంతో ఓ సామాన్యుడు ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కేరళలో పోలీస్ వాహనం ఫ్రంట్‌ సీట్‌లో కూర్చుని సీటు బెల్ట్‌ లేకుండా ప్రయాణిస్తున్నారు పోలీస్ అధికారులు. ఇది గమనించిన ఓ సామాన్యుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఎలా ప్రయణిస్తున్నారని పోలీస్ అధికారులను నిలదీశాడు. రూల్స్‌ సాధారణ ప్రజలకేనా పోలీసులకు వర్తించవా అంటూ ప్రశ్నించారు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు ఖంగుతిన్నారు. అయితే సీట్ బెల్ట్ నిబంధన కేవలం సాధారణ వ్యక్తులకేనా అంటే.. కాదు అధికారులు, సామాన్యులు అందరికీ వర్తిస్తుంది. ఈ క్రమంలో కన్నూర్‌లో పోలీసులు సీట్‌ బెల్టులు పెట్టుకోకుండా కారులో పెట్రోలింగ్‌కు వచ్చారు. అయితే ఇది గమనించిన అక్కడే ఉన్న ఓ యువకుడు వారు పోలీసులు అని కూడా చూడకుండా వారి కారును ఆపాడు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు వేసే మీరు రూల్స్ ను మీరెందుకు పాటించడం లేదని ప్రశ్నించాడు. చట్టం సామాన్య ప్రజల కోసమేనా? పోలీసులకు వర్తించదా అంటూ పోలీసు అధికారిని ప్రశ్నించాడు. యువకుడు నిలదీయడంతో కోపం వచ్చిన పోలీసు అధికారి కారులో నుంచి దిగి అతడితో వాగ్వాదానికి దిగారు. అయినా ఆ యువకుడు భయపడలేదు ఇంకాస్త ఎక్కువగానే కడిగిపారేసాడు. ఆ సమయంలో కారులో ఉన్న మరో పోలీసు వాహనం నుంచి బయటికి వచ్చి బెదిరించే ప్రయత్నం చేశాడు. డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆ యువకుడిపై కంప్లైంట్ నమోదు చేసేందుకు ఉపక్రమించాడు. అయితే ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న స్థానిక ప్రజలు గమనిస్తున్నారు. వారు వెంటనే కలుగ జేసుకుని యువకుడికి సపోర్ట్ గా నిలిచారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వారంతా ఏకమయ్యారు. దీంతో చేసేదేమి లేక అక్కడి నుంచి పోలీసులు జారుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి