iDreamPost

రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమీషనర్ పరిపాలించవచ్చు కదా?- సీఎం జగన్

రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమీషనర్ పరిపాలించవచ్చు కదా?- సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఎన్నికల కమీషనర్ వాయిదా వేసిన నేపథ్యంలో ఎన్నికల కమీషనర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదని జగన్ అన్నారు.

జగన్ మాట్లాడుతూ కరోనా వైరస్‌పై తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,కేవలం 60 ఏళ్లు పైబడిన వాళ్లు, డయాబెటిక్‌, బీపీ, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి వస్తే ఇది హానికరమైన వ్యాధిగా పరిగణించాలని పేర్కొన్నారు.కానీ ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టామని, కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారని తెలిపారు.

స్థానిక ఎన్నికల వాయిదా ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పరిస్థితి వచ్చినందుకు ఏపీ ప్రజలంతా చింతించాల్సిన అవసరముందని, వ్యవస్థలను తెదేపా అధినేత చంద్రబాబు నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పని తీరుపై బహిరంగ విమర్శలు చేశారు. ఎన్నికల కమీషనర్ విచక్షణ కోల్పోయి మాట్లాడారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓట్లేస్తే 151 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ కంటే ఎన్నికల కమీషనర్ కు ఎక్కువ అధికారాలుంటాయా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పరిపాలించవచ్చు కదా అంటూ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రమేశ్‌కుమార్‌ నియమితులయ్యారని చెప్పారు. విచక్షణాధికారం పేరుతో ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల కమీషనర్ ఏకపక్షంగా ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు? నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమీషనర్ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.? కనీసం హెల్త్ సెక్రెటరీ కి కూడా ఈ విషయం తెలియదని జగన్ పేర్కొన్నారు.వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న భయంతోనే ఎన్నికలను వాయిదా వేశారని, ఎవరో ఆర్డర్లు ఇస్తుంటే ఎన్నికల కమీషనర్ చదివి వినిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కలెక్టర్లు ఎస్పీలను బదిలీ చేస్తూ పోలీసులను సస్పెండ్ చేస్తుంటే ఇక మేమెందుకు అని జగన్ ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మాకా? లేక ఎన్నికల కమీషన్ కా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31 న ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి 5 వేల కోట్లరూపాయలు వచ్చేవని ఆ డబ్బులు వస్తే రాష్ట్రాభివృద్ధికి ఖర్చుకి చేసేవాళ్లమని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికలు వాయిదా వేసినంత మాత్రాన కరోనా తగ్గుతుందా అని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల కమీషనర్ పనితీరు గురించి పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో చర్చిస్తామని, ఇప్పటికే గవర్నర్ కి రమేష్ కుమార్ పై పిర్యాదు చేశామని జగన్ పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి