iDreamPost

నేడు సీబీఐ కోర్టుకు జగన్

నేడు సీబీఐ కోర్టుకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ తెలంగాణలోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్‌, ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని గగన్‌ విహర్‌ సీబీఐ కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. బందోబస్త్‌కు సంబంధించి ఏపీ పోలీసుల నుండి తెలంగాణ పోలీసులకు లేఖ అందింది.

తనపై ఉన్న అక్రమాస్తులకేసులో ప్రతీ శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్నా జగన్‌ సీఎం అయ్యాక పలు కారణాలతో కోర్టుకు రావడంలేదు. దీంతో ఈనెల 3న విచారణలో సిబిఐ కోర్టు న్యాయమూర్తి వ్యక్తిగత హాజరు మినహాయింపుపై అసహనం వ్యక్తం చేశారు. జనవరి 10వ తేదీన జరిగే విచారణకు జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి కూడా ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనన్నారు. అంతకుముందు జగన్ తనకు ముఖ్యమంత్రిగా పలు బాధ్యతలున్నాయని, వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపునివ్వాలని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసారు. ఈ పిటీషన్‌ను విచారించిన కోర్టు ఆర్ధిక నేరారోపణలు ఉన్న నేపధ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో జగన్‌ తరుపు న్యాయవాదులు వివిధ కారణాలతో అబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తూ వచ్చారు.

Read Also: జగన్‌ ఆస్తుల కేసు17కు వాయిదా

మొత్తంగా న్యాయమూర్తి ఆదేశాలతో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు జగన్ కోర్టుకు చేరుకుని మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటారు. మరోవైపు 2012లో వరంగల్‌ ఎన్నికల్లో అనుమతిలేకుండా ప్రచారసభ నిర్వహించిన కేసులో వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిళ కూడా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ విచారణ కూడా శుక్రవారమే హైదరాబాద్‌ లోని న్యాయస్థానంలో జరగనుంది.

అయితే గతంలో పలువురు ముఖ్యమంత్రులు న్యాయస్థానంలో తమపై ఉన్న కేసులపై సీఎం హోదాలో కోర్టులకు హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళనాడునుండి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ప్రధాని హోదాలో పీవీ నరసింహారావులు సైతం కోర్టుకు వెళ్లారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులలో విచారణ మినహాయింపునకు హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా.. ప్రస్తుత సీఎం జగన్ మాత్రం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి