iDreamPost

జడ్జ్ మెంట్ తక్కువ సెంటిమెంట్ ఎక్కువ – Nostalgia

జడ్జ్ మెంట్ తక్కువ సెంటిమెంట్ ఎక్కువ – Nostalgia

గ్రామీణ నేపథ్యంలో అందులోనూ ఊరందరికీ తీర్పులిచ్చే పాత్రలను హీరోగా చూపించడం ఎప్పటి నుంచో ఉన్నదే. కృష్ణంరాజు బొబ్బిలి బ్రహ్మన్న, మోహన్ బాబు పెదరాయుడు  లాంటివి బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. ఇలాంటి కథల్లో డ్రామా చాలా అవసరం. ఎలివేషన్లతో పాటు అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నప్పుడే సరైన రీతిలో ఆదరణ దక్కించుకుంటాయి. కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మీద ప్రభావం ఉంటుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 1992లో విజయ్ కాంత్ హీరోగా ఆర్వి ఉదయ్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘చిన్న గౌండర్’ పెద్ద విజయం సాధించింది. సంక్రాంతి రేసులో నెంబర్ వన్ విన్నర్ గా నిలిచింది.

రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. అప్పటిదాకా పూర్తి పంచెకట్టుతో వెంకటేష్ సినిమా చేయలేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నటించిన ‘చంటి’ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అందుకే ఆ ఫ్లేవర్ లోనే మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కనిపించాలనే ఉద్దేశంతో వచ్చిన చిన్న గౌండర్ ప్రతిపాదనను వెంటనే ఒప్పేసుకున్నారు. ‘బొబ్బిలిరాజా’ రూపంలో తనకు భారీ సక్సెస్ ఇచ్చిన బి గోపాల్ దర్శకుడనగానే ఇంకేమి ఆలోచించలేదు. వాస్తవానికి బి గోపాల్ కు రీమేకుల మీద పెద్దగా ఇష్టం లేదు. అయితే ఒరిజినల్ వెర్షన్ బాగా నచ్చడంతో సరేనన్నారు. పాటలు బిజిఎంలో ఎలాంటి మార్పు లేకుండా ఇళయరాజానే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. సంభాషణలు పరుచూరి బ్రదర్స్ సమకూర్చారు.  

హీరోయిన్ గా విజయశాంతి ఇతర ముఖ్యపాత్రల్లో నిర్మలమ్మ, కోట, బాబు మోహన్, మోహన్ రాజ్, నర్రా, విజయలలిత తదితరులను ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు విఎస్ ఆర్ స్వామి కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. షూటింగ్ ఎటువంటి జాప్యం లేకుండా కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేశారు. 1992 ఆగస్ట్ 7న చినరాయుడు భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. సీన్ టు సీన్ మక్కికి మక్కి దించేయడంతో ప్రేక్షకులు సినిమాలో తమిళ వాసనను ఎక్కువగా ఫీలయ్యారు. వెంకీ విజయశాంతి మధ్య సెంటిమెంట్ డ్రామా కాస్త శృతి మించడంతో యావరేజ్ దగ్గర ఆగిపోక తప్పలేదు. కేవలం వారం గ్యాప్ తో 15న మణిరత్నం రోజా రావడం ఫ్యామిలీ, క్లాస్ అండ్ యూత్  ఆడియన్స్ ని అటువైపు లాక్కెళ్ళింది. దీంతో తీర్పులు తక్కువ కన్నీళ్లు ఎక్కువగా మిగిలాడు చినరాయుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి