iDreamPost

లెక్కలు తప్పిన చంద్రలేఖలు- Nostalgia

లెక్కలు తప్పిన చంద్రలేఖలు- Nostalgia

పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు యాక్షన్ పార్ట్ లేకుండా ఎంటర్ టైన్మెంట్ ప్లస్ ఎమోషన్స్ తో బ్యాలన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి మాస్ కు అంత సులభంగా కనెక్ట్ కావు. వాళ్ళ అంచనాలు అందుకోలేవు. అలా అని మసాలా ఫైట్లు ఉంటేనే చూస్తారని కాదు. అలా అయితే పెళ్లి సందడి, నిన్నే పెళ్లాడతా అంత భారీ విజయం అందుకునేవి కాదు. సరిగ్గా ఇదే అంచనాతో వచ్చిన సినిమా చంద్రలేఖ. 1995లో హాలీవుడ్ లో వచ్చిన ‘వైల్ యు వర్ స్లీపింగ్’ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కి విపరీతంగా నచ్చేసింది. దాన్ని మోహన్ లాల్ హీరోగా ‘చంద్రలేఖ’ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని వంద రోజులకు పైగా ఆడేసింది.

ఆ సమయంలో నాగార్జున కృష్ణవంశీలు తమ కాంబినేషన్ కోసం కథల వేటలో ఉన్నారు. నిన్నే పెళ్లాడతా ఘనవిజయం సాధించాక కృష్ణవంశీ స్వంత డబ్బులతో తీసుకున్న ‘సిందూరం’ ఆర్థికంగా నష్టం తెచ్చింది. ల్యాండ్ మార్క్ ‘అన్నమయ్య’ తర్వాత నాగ్ కు రక్షకుడు, ఆవిడా మా ఆవిడే, ఆటో డ్రైవర్ ఇలా హ్యాట్రిక్ ఫ్లాపులు పలకరించాయి. అందుకే ఈసారి మంచి ఎంటర్ టైనర్ తీయాలన్న ఉద్దేశంతో చంద్రలేఖ హక్కులను కొనేసి టైటిల్ తో సహా ఏదీ మార్చకుండా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. రమ్యకృష్ణ, ఈషా కొప్పికర్ టైటిల్ పాత్రల్లో సందీప్ చౌతా సంగీతంలో కృష్ణ వంశీ మంచి టీమ్ ని సెట్ చేసుకున్నారు.

బాగా డబ్బున్న ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితంలోకి వచ్చిన సీతారామారావు అనే అమాయకుడు మంచితనం ఆ కుటుంబానికి ఎలా అండగా నిలబడిందనే పాయింట్ తో రూపొందిన ఈ సినిమాలో కావాల్సినంత హ్యూమర్ తో పాటు ఎమోషన్స్, మ్యూజిక్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. అయితే ఓ మీడియం రేంజ్ హీరో చేయాల్సిన సబ్జెక్టుని నాగ్ చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. అందులోనూ అంచనాలు విపరీతంగా ఉండటంతో చంద్రలేఖ వాటిని అందుకోలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంత మేర నచ్చినా శ్రీకాంత్ కి నాగ్ జై కొట్టడాలు, సంజయ్ దత్ కాళ్ళు పట్టుకోవడం లాంటివి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. 1998 ఆగస్ట్ 30న రిలీజైన చంద్రలేఖ నిలవలేకపోయింది. సరిగ్గా వారం ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సునామి కూడా దీని వసూళ్లను దెబ్బ తీసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి