iDreamPost

శుభవార్త.. టమాటా ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

  • Author Soma Sekhar Published - 06:15 PM, Wed - 12 July 23
  • Author Soma Sekhar Published - 06:15 PM, Wed - 12 July 23
శుభవార్త.. టమాటా ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

పేద, మధ్యతరగతి ప్రజలకే కాకుండా.. డబ్బున్న వారు కూడా టమాటా కొనేందుకు జంకుతున్నారు. అంతలా దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ద్వారా పెరిగిన టమాటా ధరలపై రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. దాంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ద్వారా టమాటాలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెరిగిన టమాటా ధరలను తగ్గించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా.. టమాటా ధరలను తగ్గించేందుకు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి చర్యలు చేపట్టింది.

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు కేజీ టమాటా ధర రూ. 150 నుంచి రూ. 200 పలుకుతోంది. ఈ ధర కొన్ని ప్రాంతాల్లో రూ. 250కి పైగా ఉండటం గమనార్హం. దాంతో ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టమాటా ధరలను కేంద్రం నియంత్రించలేకపోతోందంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టమాటా ధరలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంలో భాగంగా.. టమాటా పంటను ప్రభుత్వమే అధిక సంఖ్యలో సేకరించి.. సబ్సిడీ మీద వినియోగదారులకు అందించాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికోసం అధికంగా టమాటా పంటను పండించే రాష్ట్రాల నుంచి వాటిని సేకరించనున్నారు. ఈ పనిని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చూసుకోనుంది. టమాటాను కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్-నాఫెడ్, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దేశంలో వినియోగించే టమాటాలో 58 శాతం వస్తోంది. దాంతో ఈ రాష్ట్రాల నుంచి భారీగా పంటను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలకు కొంతలో కొంతైనా ఊరట లభించనుంది. మరి టమాటా ధర తగ్గింపు కోసం మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పవన్‌కు విలువలు ఉంటే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి: పోసాని

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి