iDreamPost
android-app
ios-app

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు.. స్పందించిన మోదీ.. ఏమన్నారంటే!

  • Published Jul 14, 2024 | 11:10 AM Updated Updated Jul 14, 2024 | 11:31 AM

Modi Reacted-Shooting At Trump Rally: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ర్యాలీ మీద కాల్పులు చోటు చేసుకోవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనపై మోదీ స్పందించారు. ఆ వివరాలు..

Modi Reacted-Shooting At Trump Rally: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ర్యాలీ మీద కాల్పులు చోటు చేసుకోవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనపై మోదీ స్పందించారు. ఆ వివరాలు..

  • Published Jul 14, 2024 | 11:10 AMUpdated Jul 14, 2024 | 11:31 AM
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు.. స్పందించిన మోదీ.. ఏమన్నారంటే!

అమెరికా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కట్టుదిట్టమైన భద్రతకు పేరు గాంచిన అగ్రరాజ్యంలో.. మాజీ అధ్యక్షుడి ఎన్నికల ర్యాలీ మీద కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మాజీ అధ్యక్షుడు.. డొనాల్డ్‌ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బుల్లెట్‌ ట్రంప్‌ చెవి పక్క నుంచి దూసుకెళ్లడంతో.. ఆయన గాయపడ్డారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే ట్రంప్‌ మీద దాడి జరిగినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ దాడికి పాల్పడిన నిందితుడి వయసు సుమారు 20 ఏళ్లని.. అతడి పేరు థామస్‌ మాథ్యూ క్రూక్‌ అని ప్రచారం జరుగుతుంది. అయితే దర్యాప్తు సంస్థలు మాత్రం ఇంకా నిందితుడి పేరును వెల్లడించలేదు. ట్రంప్‌పై కాల్పుల ఘటనను హత్యాయత్నంగానే భావించి దర్యాప్తు చేపట్టారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు మోదీ. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను తన స్నేహితుడిగా చెప్పుకొచ్చారు. ‘‘నా స్నేహితుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు ఎలాంటి చోటు లేదు. ఈ కాల్పుల ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

ఇక ఈ ఘటనపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెన్విల్వేనియాలోని ట్రంప్‌ ర్యాలీలో జరిగిన కాల్పుల ఘటనపై తనకు సమాచారం వచ్చిందని.. అయితే ఈ ఘటనలో ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడిందని బైడెన్ వెల్లడించారు. ట్రంప్‌ను కాపాడిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్స్‌కు బైడెన్‌ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నవారంతా క్షేమంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలంతా ఇలాంటి దాడులకు ఖండించేందుకు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.