iDreamPost

నష్టం జరిగాక చర్యలు.. ఆలస్యమైంది ప్రధాని గారు..!

నష్టం జరిగాక చర్యలు.. ఆలస్యమైంది ప్రధాని గారు..!

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వైఖరి కనిపిస్తోంది. కరోనా మొదటి వేవ్ లో ప్రజల దగ్గర నుంచి పీఎం కేర్ ఫండ్స్ పేరుతో భారీగా విరాళాలు పోగు చేసిన కేంద్ర ప్రభుత్వం తాపీగా ఇప్పుడు ఆ డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్ లు నిర్మించాలని భావిస్తోంది. లక్ష్యం మంచిదే అయినా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు నిర్వర్తించడం పైనే విమర్శలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ప్లాంట్లను పిఎం కేర్ విరాళాలతో నిర్మించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రోజు మూడు లక్షలు పైబడి కేసు లో వస్తున్న తరుణంలో, మరణాల రేటు అధికం అవుతున్న సమయంలో కేంద్రం తన దగ్గర పెట్టుకున్న విరాళాలతో ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నట్లు అనిపిస్తోంది. మొదటి వేవ్ తగ్గిన తర్వాత కేవలం ఎన్నికలపైనే దృష్టి పెట్టిన బిజెపి ప్రభుత్వం, భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా విస్తరిస్తున్న దాని గురించి అంతగా పట్టించుకోలేదు.

మహారాష్ట్రలో కేసుల పెరుగుదల మెల్లమెల్లగా పెరుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సింది. ఆ తరువాత క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుదల ఎక్కువ అయ్యింది. రెండో వేవ్ బలంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించినా దానికి తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం సన్నద్ధత లేదు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది లేదు. ఫలితంగా కరోనా రెండో వేవ్ బలం పుంజుకున్న తర్వాత తాపీగా ఇప్పుడు పీఎం కేర్ విరాళాలను బయటకు తీసింది.

పీఎం కేర్ ఫండ్స్ కు వేల కోట్ల రూపాయల విరాళాలు వెల్లువెత్తాయి. సాధారణ ప్రజానీకం సైతం అప్పట్లో పీఎం కేర్ కు భారీగా విరాళాలు ఇచ్చారు. దానిపైన ఇప్పటి వరకు లెక్క చెప్పని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆ డబ్బులతో ఆక్సిజన్ ప్లాంట్ లు నిర్మించాలని భావించడం మంచిదే అయినా, ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో ఉత్తర భారత దేశంలో కరోనా చావు కేకలు వినిపిస్తున్న సమయంలో ఇంకా కేంద్రం ముందుగా స్పందించి ఉంటే చాలా ప్రాణాలకు భరోసా లభించేది. ప్రస్తుతం ఆక్సిజన్ ప్లాంట్ లు ఎక్కడ ఎక్కడ పెట్టాలి అన్నది గుర్తించిన కేంద్రం వాటి నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన అన్నీ సిద్ధం చేస్తోంది.

అయితే ఈ ఆక్సిజన్ ప్లాంట్ లు ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి.. పీఎం కేర్ విరాళాలతో ఇక్కడతో సరిపెడతారా అన్నది ముందున్న ప్రశ్న. కొన్ని వేల కోట్లు విరాళాలు వచ్చాయని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం లో, విరాళాలకు లెక్కలు చెప్పడంలో నిబద్ధత లోపించిన కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. తాజాగా ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ లో నిర్మిస్తామని చెబుతున్నకేంద్రం.. మిగిలిన ప్రాంతాల్లో ఈ విరాళాలతో కావాల్సిన వైద్య మౌలిక వసతులు కల్పిస్తే, ఆస్పత్రులకు తగిన సహాయం అందిస్తే ఎంతో మంది రోగులకు విపత్తు సమయంలో ఊరట లభిస్తుంది.

Also Read : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌కు కారణం ఎవరో చెప్పిన మద్రాస్‌ హైకోర్టు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి