iDreamPost

ఘోర తప్పిదం జరిగింది.. క్షమాపణలు కోరుతున్నాను: కెనడా ప్రధాని ట్రుడో

  • Published Sep 28, 2023 | 5:17 PMUpdated Sep 28, 2023 | 5:17 PM
  • Published Sep 28, 2023 | 5:17 PMUpdated Sep 28, 2023 | 5:17 PM
ఘోర తప్పిదం జరిగింది.. క్షమాపణలు కోరుతున్నాను: కెనడా ప్రధాని ట్రుడో

ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వివాదం కారణంగా భారత్‌-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించారు. ఇప్పటికే గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కెనడా ప్రభుత్వం ఖలీస్థానీలకు ఆశ్రయం కల్పిస్తోందని భారత్ ఎంతో కాలంగా ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలో ట్రూడో సర్కారు కఠిన చర్యలు తీసుకోవడం లేదని నేరుగానే విమర్శించింది. ఇక తాజాగా నిజ్జర్‌ హత్య వివాదం కారణంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రూడో తప్పు జరిగింది.. అంటూ క్షమాపణలు తెలపడం సంచలనంగా మారింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

నిజ్జర్‌ హత్య వివాదం కొనసాగుతుండగానే.. నాజీ సైనికుడి అంశం ట్రూడో మెడకు చుట్టుకుంది. ఇప్పటికే దీని మీద దేశవ్యాప్తంగా పెను వివాదం చెలరేగడం మాత్రమే కాక.. ఏకంగా కెనడా దిగువ సభ స్పీకర్‌ పదవికి ఎసరు తెచ్చింది. మరి అసలు ఈ వివాదం ఎలా రాజుకుంది.. అంటే.. కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీ ఇటీవల కెనడాలో పర్యటించి.. ఆదేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడు యారోస్లోవ్‌ హుంకా (98)ను కెనడా స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. అతడిని పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడంటూ అతడి మీద ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో హుంకా గౌరవార్థం.. ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు.

ఆ తర్వాత అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల ప్రధానులు ఎంతో గౌరవం కురిపించిన మాజీ సైనికుడు హుంకా.. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ తరఫున పోరాడిన ‘14వ వాఫన్‌ గ్రనేడియర్‌ డివిజన్‌’కు చెందిన వ్యక్తి తెలిసింది. దాంతో ఈ ఘటనపై ట్రూడో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. స్పీకర్ రోటా అయితే ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. అయినా ఈ వివాదం చల్లారకపోవడంతో ఇక ట్రూడో బహిరంగ క్షమాపణలు తెలిపారు

‘శుక్రవారం జరిగిన ఘటనకు ఈ సభ తరఫున బేషరతుగా క్షమాపణలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో ఇప్పటికే దౌత్యవర్గాల ద్వారా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని సంప్రదించాం.. ఆ రోజున పార్లమెంట్‌కు వచ్చిన వ్యక్తిని గుర్తించడంలో ఘోర తప్పిదం జరిగింది. హుంకాను ఆహ్వానించడం.. అతడిని ప్రశంసించడం అనే మా చర్యల ద్వారా.. నాజీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన వారి చేదు జ్ఞాపకాలను విస్మరించినట్లయింది. ఇందుకు క్షమాపణలు తెలుసుతున్నాను’ అంటూ ట్రూడో విచారం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి