iDreamPost

మోడిని అనే ధైర్యం లేక జగన్ పై ఆరోపణలా ?

మోడిని అనే ధైర్యం లేక జగన్ పై ఆరోపణలా ?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా తయారైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడిని ప్రశ్నించే ధైర్యం, ఆరోపణలు చేసే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నట్లుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపిందనే సామెత చంద్రబాబు వైఖరికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం నుండి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే ప్రభుత్వం మద్యం దుకాణాల తెరవటానికి ప్రభుత్వం అనుమతిచ్చిందో వెంటనే చంద్రబాబు దగ్గర నుండి టిడిపి నేతలంతా రెచ్చిపోయి జగన్ను నోటికొచ్చినట్లు తిట్టేస్తున్నారు.

మద్యం ధరలను 25 శాతం పెంచి అమ్మటంపై చంద్రబాబు అండ్ కో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తు జగన్ పై బురద చల్లేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మద్యం షాపులు తెరుచుకోవచ్చన్న నిర్ణయం జగన్ ది కాదు. జాతీయ స్ధాయిలో నరేంద్రమోడి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఏపిలో కూడా మద్యం షాపులు తెరుచుకున్నాయి. ధరలు పెంచి అమ్మటం వరకే జగన్ నిర్ణయం తీసుకున్నాడు. మద్యం షాపులను తెరవటంపైనే కాకుండా ధరలను పెంచటంపైన కూడా టిడిపి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తోంది.

మద్యం ధరలను పెంచి అమ్మాలన్న నిర్ణయం ఒక్క ఏపిలో కాదు తీసుకున్నది. ఢిల్లీలో 70 శాతం అధిక ధరలకు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమబెంగాల్ లో 30 శాతం ధరలు పెంచేసింది. రాజస్ధాన్, చత్తీస్ ఘడ్, తమిళనాడు, కర్నాటకలో కూడా ధరలు పెరిగాయి. అంటే ఇతరత్రా ఆదాయ మార్గాలు కుప్పకూలిపోయిన నేపధ్యంలో పాక్షికంగా తెరుచుకున్న మద్యం షాపుల నుండి ఆదాయాన్ని పిండుకోవాలని చాలా రాష్ట్రాలు ఆలోచిస్తున్న విషయం అర్ధమవుతోంది.

మద్యం షాపుల విషయంలో చంద్రబాబు అండ్ కో ఏమన్నా అనాలంటే ముందు మోడినే తప్పు పట్టాలి. అలాంటిది మద్యం షాపులను తెరవాలనే నిర్ణయం తీసుకున్న మోడిని వదిలిపెట్టేసి జగన్ పై ఆరోపణలు చేయటంలో అర్ధమేలేదు. మోడిని ఏమన్నా అంటే తన భవిష్యత్తు ఎలాగుంటుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే మోడిని ఏమనలేక ఆ కోపాన్నంతా జగన్ పై చూపిస్తున్నాడు.

టిడిపి వాళ్ళ మాటలు ఎలాగున్నాయంటే మద్యం షాపులు తెరవటం వల్లే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని ఆరోపిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు మద్యం ఆదాయంపై ఆధారపడిన విషయం అందరికీ తెలిసిందే. ఇది కాకుండా దాదాపు 48 వేల బెల్టుషాపులను ప్రోత్సహించిన చరిత్ర చంద్రబాబుదే. జగన్ అధికారంలోకి రాగానే వేలాది బెల్టుషాపులను పూర్తిగా నియంత్రించాడు. దశలవారీ మద్య నియంత్రణ హామీలో భాగంగా 800 షాపులను తగ్గించాడు.

దశలవారీ మద్య నిషేధంలో భాగంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తమ కళ్ళముందే కనిపిస్తున్నా పచ్చదళాలు ఒప్పుకోవటం లేదు. అందుకనే జగన్ పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి కరోనా వైరస్ సంక్షోభ సమయంలో మద్యం షాపులు తెరవాలన్న నిర్ణయం మోడి ఎందుకు తీసుకున్నాడో అర్ధం కావటం లేదు. మోడిని నిలదీసే ధైర్యంలేని చంద్రబాబు అండ్ కో జగన్ పై నోరుపారేసుకుంటున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి