iDreamPost

బాలయ్యకు మరో అగ్ని పరీక్ష!

బాలయ్యకు మరో అగ్ని పరీక్ష!

నందమూరి బాలకృష్ణ తాజాగా వీరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి కాస్త మెరుగైన వసూళ్లే రాబట్టింది. జనవరి 12న విడుదలైన ఈ మూవీ వారం రోజుల్లో రూ.65 కోట్ల షేర్ రాబట్టింది. అయితే వీరసింహా హిట్ అనిపించుకోవాలంటే ఈ కలెక్షన్ల జోరు సరిపోదు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని అంచనా. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా కనీసం పది కోట్ల షేర్ రాబాట్టాల్సి ఉంది. కానీ ఇప్పటికే వీరసింహా జోరు తగ్గింది. పండగ సెలవులు కూడా అయిపోయాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో వీరసింహారెడ్డి సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు బాలకృష్ణ మరో అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నాడు.

కొంతకాలంగా నార్త్ లో సౌత్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే మేకర్స్ సౌత్ తో పాటు హిందీలోనూ ఒకేసారి లేదా కొద్దిరోజుల వ్యవధితో సినిమాలు విడుదల చేస్తున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఎప్పుడో ఏడాది క్రితం వచ్చిన అఖండ సినిమాతో ఇప్పుడు అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021, డిసెంబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినప్పటికీ ఇందులో అఘోర పాత్ర, శివతత్వం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలాంటి దైవత్వం ఉన్న సినిమాలను నార్త్ లో బాగానే ఆదరిస్తారు. అలా అని ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్న.. ఎప్పుడో ఏడాది క్రితం నాటి సినిమాను ఇప్పుడు విడుదల చేసినా చూస్తారు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అఖండ విషయంలో అదే జరుగుతోంది.

హిందీలో అఖండ చిత్రం శుక్రవారం(జనవరి 20) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ ప్రకటన వచ్చినప్పుడే ఇంత ఆలస్యంగా విడుదల చేస్తే ఎవరు చూస్తారని పెదవి విరిచారంతా. ఇప్పటికే ఓటీటీ లో అందుబాటులో ఉంది. పైగా ఇటీవల విడుదలైన హిందీ ట్రైలర్ డబ్బింగ్ కూడా తేలిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అయినప్పటికి అఖండ మాత్రం హిందీలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ ప్రేక్షకుల నుంచి కనీస స్పందన కూడా కరువైంది. బాలకృష్ణ నార్త్ ఆడియన్స్ కి పెద్దగా తెలీదు. ఒకవేళ తెలిసినా ఓటీటీ లో అందుబాటులో ఉన్న పాత సినిమా చూడటానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఇది చాలదు అన్నట్లుగా 25వ తేదీన షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విడుదలవుతోంది. ఆ సినిమా విడుదలయ్యాక నార్త్ ఆడియెన్స్ అఖండ ను పట్టించుకోవడం దాదాపు అసాధ్యం. అంటే ఐదు రోజుల్లోనే అఖండ తన సత్తా చాటాల్సి ఉంది. కానీ హిందీ ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని బుకింగ్స్ ని బట్టి అర్థమవుతోంది. అసలు సినిమాని హిందీలో రిలీజ్ చేయకుండా ఉంటే ఏ గోల ఉండదు. కానీ రిలీజ్ అయ్యి కనీస కలెక్షన్లు రాబాట్టలేకపోతే మాత్రం బాలకృష్ణ లాంటి బడా హీరోకి అవమానమనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి