iDreamPost

వెనువెంటనే.. క్యాబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశం

వెనువెంటనే.. క్యాబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ సోమవారం జరగనుంది. ఈ రోజు క్యాబినెట్ సమావేశం ఉంటుందని ముందుగానే నిర్ణయించినా మళ్లీ సోమవారానికి వాయిదా పడింది. క్యాబినెట్ భేటీ అనంతరమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9 గంటలకు సచివాలయంలో జరిగే కేబినెట్‌ సమావేశంలో ప్రధానంగా 13 జిల్లాల సమగ్రాభివృద్ధిపైన, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపైన హైపవర్‌ కమిటీ ఇచ్చే నివేదిక మీద చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.

రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలతోపాటు గతంలో శివరామకృష్ణన్‌ ఇచ్చిన నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసిన హైపవర్‌ కమిటీ నిన్న శుక్రవారం సీఎం కు ప్రెసెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. హైపవర్ కమిటీ తన నివేదికను సోమవారం కేబినెట్‌కు సమర్పించనుంది. అనంతరం దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేందుకు, అలాగే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్, లెజిస్లేచర్‌ వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు వీలుగా కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేబినెట్‌ సమావేశానంతరం సోమవారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి