iDreamPost

నిమ్మగడ్డతో భేటీ అందుకేనట.. సుజనా చౌదరి ప్రకటన

నిమ్మగడ్డతో భేటీ అందుకేనట.. సుజనా చౌదరి ప్రకటన

హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఈ నెల 13వ తేదీన బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు, ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌లు రహస్యంగా భేటీ అయిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై ఉదయం నుంచి మీడియా ఛానెళ్లలో తీవ్ర చర్చ సాగుతోంది. హయత్‌ హోటల్‌లోని 8వ అంతస్తులో వీరు ముగ్గురు భేటీ అయ్యారు. ముగ్గురుని ఒకే వ్యక్తి రిసీవ్‌ చేసుకుని రూమ్‌ వద్దకు స్వయంగా తీసుకెళ్లారు. వీరు ఎందుకు భేటీ అయ్యారు..? దీని వెనుక లక్ష్యం ఏమిటి..? అసలు వీరు ఏమి మాట్లాడుకున్నారు..? అనే ప్రశ్నలు మీడియా,రాజకీయ వర్గాలు సంధిస్తున్న నేపథ్యంలో సుజనా చౌదరి ఈ భేటీపై ఓ ప్రకటన విడుదల చేశారు.

కరోనా వైరస్‌ కారణంగా తన వ్యాపార, రాజకీయాలు బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో నిర్వహిస్తున్నట్లు సుజనా తెలిపారు. ఈ నెల 13వ తేదీన కామినేని శ్రీనివాస్‌ తన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని, అదే రోజు మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కూడా అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని సుజనా తెలిపారు. కామినేని శ్రీనివాస్‌తో ఏపీ బీజేపీ వ్యవహరాలు మాట్లాడానని, ఆయన వెళ్లిపోయిన తర్వాత నిమ్మగడ్డతో మాట్లాడానని ఆ ప్రకటనలో తెలిపారు. నిమ్మగడ్డరమేష్‌ కుమార్‌ తన ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని చెప్పుకొచ్చారు. మా ముగ్గురి మధ్య ఎలాంటి రాజకీయాలు చర్చకురాలేదన్నారు. ఎవరినో, ఏదో చేయాలనే కుట్రతాము చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆరోపణలు, విమర్శలను తాను పట్టించుకోబోనని పేర్కొన్నారు. తన రాజకీయాలు ఎప్పుడూ పాదర్శకంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కొన్ని మీడియా ఛానెళ్లు వీడియో ఫుటేజీలు చూపిస్తున్నాయని మండిపడ్డారు.

మొత్తం మీద ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారంపై సుజానా స్పందించడంతో కొన్ని విషయాలపై క్లారిటీ రాగా. మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో తాను భేటీ అయ్యానని సుజనా స్పష్టత ఇవ్వడం ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారం నిజమేనని రుజువైంది. అయితే కరోనా వల్ల గత కొంత కాలంగా పార్క్‌ హయత్‌ హోటల్‌ నుంచి రాజకీయ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సుజనా చెప్పారు. అందరినీ అక్కడే కలుస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే సీసీ ఫుటేజీలో కనిపిస్తున్నట్లు.. ఒక వ్యక్తి కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌లతోపాటు సుజనా చౌదరిని కూడా దగ్గరుండి మరీ రూమ్‌ వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి..? తాను ఎప్పటి నుంచో అక్కడ రాజకీయ, వ్యాపార కార్యాకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు నేరుగా తన రూమ్‌కు ఎందుకు వెళ్లలేకపోయారు..? ఏదో కొత్తగా వెళుతున్న వ్యక్తిలా.. సదరు గుర్తు తెలియని వ్యక్తి సహాయంతో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? అనే ప్రశ్నలు ప్రజల మెదల్లో మెదులుతున్నాయి.

కామినేని శ్రీనివాస్‌ వెళ్లిపోయిన తర్వాతనే నిమ్మగడ్డతో మాట్లాడానని చెబుతున్నారు. రూం నుంచి కామినేని మధ్యాహ్నం ఒంటి గంట 13 నిమిషాల 3 సెకన్లకు బయటకు వచ్చారు. ఆయన తర్వాత వెంటనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఒంటి గంట 13 నిమిషాల 13 సెకన్లకు రూం నుంచి బయటకు వచ్చారు. అంటే కామినేని వచ్చిన తర్వాత 10 సెకన్లకే నిమ్మగడ్డ కూడా బయటకు వచ్చారని సీసీ టీవీ ఫుటేజీ ద్వారా వెల్లడవుతోంది. వీరు ఇద్దరు వచ్చిన తర్వాత వెంటనే ఒంటి గంట 13 నిమిషాల 32 సెకన్లకు సుజనా కూడా రూం నుంచి బయటకు వచ్చారు. మరి సుజనా చెబుతున్నట్లు.. కామినేని, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యాను. కామినేని వెళ్లిపోయిన తర్వాత నిమ్మగడ్డతో భేటీ అయ్యాను అని సుజనా సుజనా చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

‘‘ నేను ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటాను. నా రాజకీయాలు పారదర్శకంగా ఉంటాయి. రహస్య కార్యకలాపాలు నేను చేయ్యను. చేయాల్సిన అవసరం నాకు లేదు.’’ అని సుజనా చౌదరి తన ప్రకటనలో పేర్కొన్న దాన్ని బట్టీ ఒక విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరోనా కారణంగా గత కొద్ది కాలంగా పార్క్‌ హయత్‌ హోటల్‌ నుంచి తన రాజకీయ, వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నానని చెబుతున్న సుజనా చౌదరి.. అక్కడ రూమ్‌ ఎప్పటి నుంచి బుక్‌ చేశారు..? ఎవరి పేరుపై బుక్‌ చేశారు..? బిల్‌ ఎవరు కడుతున్నారు/కట్టారు..? అనే వివరాలు బయటపెట్టాలి. అప్పుడు పారదర్శకత, ఓపెన్‌ అంటూ సుజనా చేసిన మాటలు చేతల్లో కూడా చూపినట్లుగా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి