iDreamPost

పోలీస్ క‌మిష‌న‌ర్ వ‌ర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే

పోలీస్ క‌మిష‌న‌ర్ వ‌ర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే

గ్రేట‌ర్ హైద‌‌రాబాద్ లో బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఎప్పుడూ వార్త‌లో వ్య‌క్తిగా ఉంటారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, నిర్ణ‌యాలతో వివాదాస్ప‌ద ఎమ్మెల్యేగా పేరుంది. గో సంర‌క్ష‌ణ‌లో మాత్రం ముందుంటారు. ఇదే క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో తెలంగాణ పోలీసులు ఆగ‌మాగం అవుతున్నారు. అలాంటి మాట‌లు త‌గ‌వ‌ని రాజాసింగ్ ను హెచ్చ‌రిస్తున్నారు. ఇదే విష‌య‌మై బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్‌ లోధా, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జ నార్‌ మధ్య మంగళవారం మాటల యుద్ధం జరిగింది. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన అంశమే దీనికి కారణమైంది. ఈ వ్యవహారంలో శంషాబాద్‌ వెళ్లిన రాజాసింగ్‌ పోలీసులపై ఆరోపణలు చేస్తూ తన వాహనం నుంచి సెల్ఫీ వీడియో విడుద ల చేశారు. లోన్‌ యాప్స్‌ నిందితుల అరెస్టుపై నిర్వహించిన మీడియా సమావేశంలో దీనిపై సజ్జనార్‌ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో తన ‘స్వరం మార్చిన’రాజాసింగ్‌ రాత్రికి మరో వీడియో విడుదల చేశారు.

ఉదయం సెల్ఫీ వీడియోలో రాజాసింగ్ ఇలా..

‘మహారాష్ట్ర నుంచి ఒక బండిలో 45 ఆవులు, దూడలు బహదూర్‌పురలోని స్లాటర్‌ హౌస్‌కు తీసుకొస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలసి బహదూర్‌పురలో అక్రమ పశువధపై ప్రశ్నించినా సమాధానం లేదు. మీకు దొరకని బండి మాకు ఎందుకు దొరుకుతోందని సీపీ, డీజీపీలను ప్రశ్నిస్తున్నా.. మా కార్యకర్తలు ఇలాంటి బండ్లు ఆపితే లాఠీచార్జ్‌ చేసి కేసులు బుక్‌ చేస్తున్నారు. నువ్వు ఎవరు? ఏ అధికారముందని ప్రశ్నిస్తున్నారు. నేరాలు ఆపే అధికారం ప్రజలకు కూడా ఉంటుంది. కొత్తూర్‌ ఎస్సై శ్రీధర్‌ ఒక బండిని డబ్బు తీసుకుని పంపిస్తున్నారు. తన లిమిట్స్‌ దాటడానికి డబ్బు తీసుకుని బ్రోకర్‌గా తయారవుతున్నారు. శాలరీ చాలట్లేదంటే మేము భిక్షం ఎత్తుకుని పోలీసులకు డబ్బులిస్తాం. ఇలాంటి పాపం మాత్రం చేయకండి..

పోలీసులపై నిందలు ఫ్యాషనైపోయింది..

ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులపై నిందలు వేయడం ఫ్యాషనైపోయింది. దేశంలోనే తెలంగాణ పోలీసు నంబర్‌ వన్‌.. పోలీసులు ఎవరైనా డబ్బులు తీసుకున్నారంటే సాక్ష్యాలు చూపండి. ఫిర్యాదులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. డబ్బు తీసుకున్నారనే ఆధారాలుంటే బయటపెట్టండి. అయినా కూడా చర్యలు తీసుకోకుంటే అప్పుడు మాట్లాడండి.. అంతేకానీ బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆ వ్యాఖ్యలపై న్యాయపర చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసు నమోదు చేస్తాం.. అని సైబ‌రాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.

మ‌రో వీడియోలో రాజాసింగ్ ఇలా..

సైబరాబాద్‌ కమిషనర్‌కు చాలెంజ్‌ చేస్తున్నా. మీ పరిధిలో పోలీస్‌ స్టేషన్ల ముందు నుంచి అక్రమంగా ఆవుల్ని వధించడానికి తీసుకెళ్తున్నారా? లేదా? ఈ నివేదిక మీరు తెచ్చుకోండి. అందులో తేలిన నిజానిజాలను బట్టి నాపైనా లేదా పోలీసులపై చర్యలు తీసుకోండి. గోవుల్ని తరలిస్తున్న వాహనాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. గతంలో మీ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు కార్యకర్తలు ఓ బండిని పట్టుకుని తీసుకుని వెళ్తే దూషించారా? లేదా? వారిపై రౌడీషీట్‌ తెరుస్తామని వార్నింగ్‌ ఇవ్వడం నిజమా? కాదా? మీరు మంచి కమిషనర్‌.. మీ పరిధిలోని సరిహద్దు ఠాణాల్లో చెక్‌పోస్టులు పెడితే ఒక్క వాహనం నగరం లోపలకు రాదు. మేము కూడా రోడ్డు మీదకి రాము.. అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.. ఇలా పోలీసుల‌కు, బీజేపీ ఎమ్మెల్యేకు మ‌ధ్య సాగిన మాట‌ల యుద్ధం సిటీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి