iDreamPost

నితీశ్‌యే ఎన్డీయే బలం అంటున్న గత ఫలితాలు..కానీ ఆయనకు దూరం జరుగుతున్న బిజేపీ

నితీశ్‌యే ఎన్డీయే బలం అంటున్న గత ఫలితాలు..కానీ ఆయనకు దూరం జరుగుతున్న బిజేపీ

బీహార్‌ రాజకీయాలలో బిజేపీ,ఆర్‌జేడీ,జేడీయూ పార్టీలదే ప్రధాన పాత్ర.వీటిలో ఏ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన రాజ్యాధికారం దక్కుతుందని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయి..కానీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో మిత్రుల కలిసి బరిలోకి దిగిన జేడీయూ,బీజేపీ శత్రువుల వలె పరోక్షంగా కత్తులు దూసుకుంటున్నాయి.

ప్రస్తుతం బీహార్ ఎన్నికలలో ప్రధానంగా పోటీ రెండు కూటముల మధ్య కేంద్రీకృతమై ఉంది. వీటిలో మొదటిది తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌ ఒకటి కాగా,నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే రెండవది. 2015 ఎన్నికలలో కాంగ్రెస్,లాలూతో నీతీశ్ చేతులు కలిపి మహాఘట్ బంధన్‌ ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ సంకీర్ణానికి 243 స్థానాలలో కేవలం 58 సీట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి 178 సీట్లు దక్కించుకున్నాయి. ఆ ఎన్నికలలో మహా కూటమి ఓటింగ్ శాతం 41.9 పొందగా బీజేపీ సంకీర్ణం 34.1 శాతం ఓట్లతో సంతృప్తి పడాల్సి వచ్చింది.నాడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి విశేషమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ బీహార్‌లో బీజేపీ విజయం సాధించలేకపోయింది.దీంతో జేడీయూ లేకపోతే తమ విజయ అవకాశాలకు గండి పడుతుందని బీజేపీకి అర్థమైంది.

ఈ నేపథ్యంలో కొంత అయిష్టంగానే నీతీశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్న బిజేపీ,జేడీయూతో కలిసి ఎన్నికల పోరాటానికి సిద్ధపడింది. కానీ ముందస్తు వ్యూహంలో భాగంగా చిరాగ్ పాశ్వాన్‌తో జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌పై విమర్శలు చేయిస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం నితీశ్‌కి ప్రజల నుండి సరైన ఆదరణ లభించడం లేదు.దీంతో బీహార్ ప్రజలలో నితీశ్‌పై తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుందనే అంచనాకు బీజేపీ వచ్చింది.ఫలితాల అనంతరం నితీశ్‌ని ముఖ్యమంత్రి పీఠానికి దూరం పెట్టేందుకు బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండడం ప్రస్తుతం బీహార్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.కాగా అపనమ్మక రాజకీయాలు ఇరుపార్టీల మధ్య ఓట్ల బదిలీకి ఆటంకం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

బీజేపీ ఎన్నికల ప్రచార పోస్టర్లు,వీడియోలో సీఎం నితీశ్ కుమార్ పేరు ప్రస్తావించకుండా కేవలం ప్రధాని మోడీ ఫోటోని ఉంచింది.జేడీయూ కూడా నితీశ్ పాలనలో సాధించిన అభివృద్ధి గురించి మాత్రమే క్యాంపెయిన్ చేస్తోంది.ఆ పార్టీ ప్రచార సామగ్రిలో బీజేపీ అగ్ర నాయకుల ఫోటోలు దర్శనం ఇవ్వడం లేదు. జేడీయూ తమ స్టార్‌ క్యాంపెయిన్‌గా నితీశ్‌ని ముందుకు తీసుకురాగా, బీజేపీ మోడీ, అమిత్ షా మాత్రమే తమ ప్రచార అస్త్రాలు అని చెప్పకనే చెబుతుంది.

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్‌ని ముఖ్యమంత్రి పీఠానికి దూరం పెట్టేది ఓటరులా..? బీజేపీనా..? అనే ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి