iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బలాలు, బలహీనతలు! ఆరో కప్ గెలిచే ఛాన్స్? 

  • Author Soma Sekhar Published - 12:16 PM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Published - 12:16 PM, Mon - 2 October 23
వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బలాలు, బలహీనతలు! ఆరో కప్ గెలిచే ఛాన్స్? 

ఆస్ట్రేలియా.. ప్రపంచ క్రికెట్ ను కొన్ని దశాబ్దాల పాటుగా శాసించింది. అప్పట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే.. ప్రత్యర్థి జట్లకు ఓటమి ఖాయం అన్న చందంగా తయ్యారు అయ్యింది పరిస్థితి. అందుకు తగ్గట్లుగానే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా కంగారూల టీమ్ ఘనత వహించింది. ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఏకంగా 5 సార్లు ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఇప్పుడు ఆరోసారి వరల్డ్ కప్ ను చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో పాటుగా భారత్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు పటిష్టంగా మారడంతో.. ఆసీస్ కు కష్టాలు మెుదలైయ్యాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో ఆసీస్ బలాలు, బలహీనతలు ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం.
వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు అందులో ఆస్ట్రేలియా టీమ్ గురించి చర్చ కచ్చితంగా ఉంటుంది. దానికి కారణం ఆసీస్ అత్యధికంగా 5 సార్లు వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడమే. చివరిసారిగా 2015లో ప్రపంచ కప్ ను ముద్దాడింది కంగరూ టీమ్. అయితే ఈసారి ఆసీస్ కు తీవ్ర పోటీ ఎదురౌతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ప్రస్తుతం ఆసీస్ టీమ్ గతంలోలాగా రాణించడం లేదు. కానీ.. ఆస్ట్రేలియా టీమ్ ను తేలికగా తీసుకోవడం పెద్ద తప్పిదమే అవుతుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. జట్టులో వరల్డ్ కప్ గెలిచిన అనుభవం గల ఆటగాళ్లు చాలా మందే ఉండటం ఆసీస్ కు బలం. ఇక ఈ ప్రపంచ కప్ జట్టులోని చాలా మందికి చివరి వరల్డ్ కప్ కానుంది. దీంతో వారికి టైటిల్ తో ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తోంది ఆసీస్ టీమ్. ఇక ఇప్పుడు ఆసీస్ టీమ్ బలాలను, బలహీనతలను పరిశీలిద్దాం.

ఆస్ట్రేలియా బలాలు

ఆస్ట్రేలియా జట్టుకు ప్రధాన బలం 2015 వరల్డ్ కప్ గెలిచిన సభ్యుల్లో సగం మంది ఈ ప్రపంచ కప్ లో ఉండటమే. వారి అనుభవం జట్టు విజయాలకు ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వార్నర్, హేజిల్ వుడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వీరు 2 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాను టీ20 ఛాంపియన్ గా నిలపడంలో కీలక పాత్ర వహించారు. ఇక వీరితో పాటుగా జట్టులో అద్భుత ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్, ఆడమ్ జంపా స్టార్ ఆల్ రౌండర్స్ అయిన స్టోయినిస్, మాక్స్ వెల్ కు ఆసీస్ కు అదనపు బలం.
ఇక ఆస్ట్రేలియా టీమ్ లో ఉన్న చాలా మంది ప్లేయర్లకు మెగా టోర్నీలు ఆడిన అనుభవం ఉంది. ఇది వారికి మిగతా జట్ల కన్నా బలమనే చెప్పాలి. పైగా వార్నర్, మార్ష్ లు జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చి.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేయగల సమర్థులు. వీరితో పాటుగా స్టీవ్ స్మిత్, లబూషేన్, మాక్స్ వెల్, స్టోయినిస్, గ్రీన్ లు జట్టుకు కొండంత అండ. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. వరల్డ్ క్లాస్ పేస్ బౌలింగ్ ఆస్ట్రేలియా సొంతమనే చెప్పాలి. హేజిల్ వుడ్, కమ్మిన్స్, స్టార్క్ లతో పేస్ దళం శత్రుదుర్భ్యేద్యంగా ఉంది. మరో ఎండ్ లో నాథన్ ఎల్లిస్, స్టోయినిస్, ఆడమ్ జంపా, గ్రీన్ లు కూడా సత్తా చాటగల ఆటగాళ్లే. వీరందరూ కలిసి రాణిస్తే.. ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవనే చెప్పాలి.

ఆసీస్ బలహీనతలు

వరల్డ్ కప్ లో చాలా జట్లకు ఉన్న ప్రధాన సమస్య గాయాలు. ఒక్క ఆస్ట్రేలియాకే కాదు.. మిగతా టీమ్ లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆసీస్ పేపర్ మీద బలంగా కనిపిస్తున్నా.. ఆ టీమ్ లో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. సంచలన ఇన్నింగ్స్ లు ఆడగల ట్రావిస్ హెడ్ కు గాయం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అష్టన్ అగర్ కూడా గాయం కారణంగా టోర్నీ మెుత్తానికే దూరం అయినట్లు తెలుస్తోంది. దీంతో స్పిన్ బౌలింగ్ భారం మెుత్తం ఆడమ్ జంపాపైనే పడింది. ఇది అతడికి ఒత్తిడిని తెచ్చే ప్రమాదం ఉంది. కాగా.. ఆల్ రౌండర్లు అయిన స్టోయినిస్, మాక్స్ వెల్, గ్రీన్ ను గత కొంతకాలంగా బ్యాటింగ్ లో పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. ఇది కూడా ఆసీస్ కు సమస్యగా మారింది. ఇటీవల భారత్ తో వన్డే సిరీస్ లో హేజిల్ వుడ్ దారళంగా పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడిపై ఆసీస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ బలహీనతలు అధిగమిస్తేనే ఆసీస్ కలలు కంటున్న ఆరో ప్రపంచ కప్ ను ముద్దాడేది. మరి ఆసీస్ జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి