iDreamPost

ఇదేనా సమన్వయం..?

ఇదేనా సమన్వయం..?

ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదు. ఈ సమయంలో జోక్యం చేసుకోబోము. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి… ఇదీ ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న వివాదానికి పరిష్కారంగా దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు. సుప్రిం తీర్పును గౌరవిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటూ.. అందుకు అనుగుణంగా పని చేయడం ఆరంభించింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాత్రం సుప్రిం తీర్పును అర్థం చేసుకోలేదో, లేక తాను చెప్పిందే జరుగుతోందనే ఇగోతో ఉన్నారో గానీ.. సుప్రిం చెప్పిన సమన్వయం అనే మాటను పెడచెవిన పెడుతున్నారు. గందరగోళమే లక్ష్యంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ హల్‌చల్‌ చేస్తున్నారు. నిమ్మగడ్డ తీరుకు.. పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్ల బదిలీ అంశమే ప్రత్యక్ష ఉదహరణగా నిలుస్తోంది.

గందరగోళానికి తెరలేపుతూ..

సోమవారం రాత్రి.. పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికారులు ఇద్దరినీ బదిలీ చేస్తున్నట్లు నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రిం తీర్పును గౌరవిస్తున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటకు కట్టుబడుతూ.. కమిషనర్‌ ఆదేశాలను అమలు చేసేందుకు యత్నించింది. ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ.. వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు చొప్పన అధికారుల పేర్లను సిఫార్సు చేస్తూ ఎన్నికల కమిషన్‌కు పంపింది. సీన్‌ కట్‌ చేస్తే.. ఈ రోజు మంగళవారం ఉదయం పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికారులను బదిలీ చేయాలని తాను సిఫార్సు చేయలేదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికల ముఖ్య కార్యదర్శి, కమిషనర్ల బదిలీ సరికాదని చెబుతూ.. చేయకూడని పని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా కలరింగ్‌ ఇస్తూ.. వివాదాలకు, అనవసరమైన గందరగోళానికి తెరలేపుతున్నారు.

కేంద్ర సిబ్బందిని ఉపయోగిస్తారట..?

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకుంటామంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాసిన లేఖ ఆయన ఎలాంటి తీరుతో వ్యవహరిస్తున్నారో, ఎవరి అంజెండాను అమలు చేస్తున్నారో అర్థమవుతోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎన్నికలు నిర్వహించాలనే ఉద్యోగులు కోరుతున్నారు తప్పా.. ఎన్నికల విధులకు హాజరుకాబోమని చెప్పడం లేదు. పోలీసులదీ అదే తీరు.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు కరోనా వైరస్‌ భయందోళనతో ఉన్నారు. కానీ సుప్రిం తీర్పు తర్వాత చట్ట ప్రకారం తమ విధులను నిర్వర్తించేందుకు ఉద్యోగులు ప్రాణహాని ఉన్నా సిద్ధమయ్యారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశంపై అందరిలోనూ ఆందోళన ఉంది. కానీ నిమ్మగడ్డ మాత్రం.. రాష్ట్ర ఉద్యోగులు సహకరించడం లేదు, ఇక్కడ పోలీసులపై నమ్మకం లేదనేలా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, బలగాలను వినియోగించుకుంటామనే ప్రకటనలు చేస్తుండడం.. టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలను అమలు చేస్తున్నట్లుగా ఉంది తప్పా.. తాను స్వతహాగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా లేదు, ఏది ఏమైనా.. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకూ నిమ్మగడ్డ వ్యవహరించే తీరు ఎలా ఉండబోతోందో అందరూ ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారన్నది మాత్రం వాస్తవం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి