iDreamPost

నిమ్మగడ్డ ఆలోచన నిలబడుతుందా..? పరిషత్‌ ఎన్నికలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన..!

నిమ్మగడ్డ ఆలోచన నిలబడుతుందా..? పరిషత్‌ ఎన్నికలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన..!

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో బెదిరింపులు, దౌర్జన్యాలు వల్ల నామినేషన్లు దాఖలు చేయలేదని, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారనే భావనతో.. ఆయా స్థానాల్లో మళ్లీ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది.

ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్‌వో ధృవీకరిస్తూ ఫాం–10 జారీ చేసిన తర్వాత.. విచారణ జరిపే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది గత విచారణలో తెలిపిన అంశాన్నే మళ్లీ చెప్పారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అంతేకాకుండా ఫాం –10 జారీ చేసిన స్థానాలపై విచారణ, ఫాం–10 తీసుకోని స్థానాలపై ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వెల్లడించవద్దని న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఆదేశాలను సోమవారానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సమర్థించుకునేందుకు కమిషన్‌ యత్నాలు..

తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టికల్‌ 243కే ప్రకారం నామినేషన్లు దాఖలు చేయలేని వారికి అవకాశం కల్పించామని కమిషన్‌ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్‌ ధర్మాసనానికి తెలిపారు. బెదిరింపులు, దౌర్జన్యాల వల్ల నామినేషన్లు దాఖలు చేయలేకపోయామంటూ ఇప్పటికీ ఫిర్యాదులు వస్తున్నాయని కోర్టుకు తెలిపారు. తమ ఆదేశాలను అమలు చేసేలా, కలెకర్లరు ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేలా ఇటీవల జారీ చేసిన మధ్యంత ఉత్తర్వులను సడలించాలని కోరారు.

ఈ క్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికై ఫాం –10 తీసుకోని అభ్యర్థులు గత శుక్రవారం నుంచి సోమవారం వరకూ తీసుకున్నారని కమిషన్‌ న్యాయవాది తెలిపారు. ఇక్కడే కమిషన్‌ దొరికిపోయింది. వాయిదా పడిన పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కాలేదు. అలాంటిది ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎవరు..? ఎప్పుడు..? ఫాం – 10 జారీ చేశారనే ప్రశ్న తలెత్తింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది.. గతంలో ఫాం – 10 తీసుకోని అభ్యర్థులు శుక్రవారం నుంచి సోమవారం లోపు తీసుకున్నారని కమిషన్‌ ఏ ఆధారంతో చెబుతోందంటూ ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కమిషన్‌ను ధర్మాసనం

వచ్చే నెలలోనే పరిషత్‌ ఎన్నికలు..

తాగాజా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఈ నెలలో జరగబోవని తేలిపోయింది. తదుపరి విచారణను వచ్చే నెల 1వ తేదీకి ధర్మాసనం వాయిదా వేయడంతో మార్చిలోనే ఎన్నికలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. 10వ తేదీన ఎన్నికలు, 14వ తేదీన లెక్కింపు, ఫలితాల వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలకు ముందు, లేదా తర్వాత.. ఎప్పుడు పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయనేది కోర్టులో విచారణ పూర్తయ్యే దానిపై ఆధారపడి ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తుది అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు పూర్తయింది. ప్రచారం వద్ద నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ప్రచారం, పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు వారం రోజుల సమయం పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి