iDreamPost

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం.. జగన్‌ సర్కార్‌ కీలక చర్యలు

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం.. జగన్‌ సర్కార్‌ కీలక చర్యలు

ప్రజా ప్రాతినిధ్య విధానంలో తమ కోసం ఎన్నుకున్న ప్రభుత్వంతో ఎన్నికల తర్వాత ప్రజలకు ఉండే సంబంధాలు అతి తక్కువనే చెప్పాలి. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు గెలిచిన తర్వాత ఉండలేరు. అందుకు అనేక కారణాలున్నాయి. ఈ క్రమంలో తమ సమస్యలను, బాధలను చెప్పుకుందామని స్థానిక అధికారుల వద్దకు వెళ్లినా రిక్తహస్తాలే తప్పా పరిష్కారం ఆమడదూరంలో కూడా కనిపించదు. కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదు.

ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఈ సమస్యకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ సేవలు, సమస్యలపై టోల్‌ ఫ్రి నంబర్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటోంది. ఈ నంబర్ల ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చు. మద్యం ఇసుక అక్రమాలు, ప్రభుత్వ అధికారులు అవినీతి, రైతు సమస్యలు తదితర అంశాలపై ఇప్పటికే టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసిన జగన్‌ సర్కార్‌ తాజాగా మరో విభాగానికి సంబంధించి టోల్‌ ఫ్రి నంబర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యంపై జగన్‌ సర్కార్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. నాడు – నేడు అనే విధానంలో ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలను ఆధునీకరించేందుకు సిద్ధమైంది. ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోయినా.. ప్రభుత్వ సేవల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా నేరుగా ప్రభుత్వం దృష్టికి ప్రజలు తీసుకొచ్చేలా త్వరలో టోల్‌ ఫ్రి నంబర్‌ను తీసుకొస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.

నాడు నేడులో భాగంగా మొదటి దశలో వచ్చే నెల ఆఖరుకు 15,715 పాఠశాలు, కళాశాలల్లో 9 రకాల మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేస్తామని తెలిపారు. రెండో దశలో మరో 7,500 కోట్ల రూపాయలతో మిగతా పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లోపించినా.. మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా పెడుతున్న జగనన్న గోరుముద్దలో నాణ్యత లోపించినా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరైనా సరే నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చేందుకు త్వరలో టోల్‌ ఫ్రి నంబర్‌ను తెస్తున్నట్లు మంత్రి సురేష్‌ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి